నమస్తే న్యూస్‌నెట్‌వర్క్, నవంబర్ 3: రాష్ట్ర ప్రభుత్వం చెలించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లాలోని ఎంజీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు నిరవధిక బంద్ చేపట్టాయి. జిల్లా వ్యాప్తంగా యాజమాన్యాలు బంద్ పాటిస్తూ కళాశాల ఎదుట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించే వరకు బహిష్కరణ కొనసాగుతుందని ఎంజీయూ టీపీడీపీఎంఏ, ఎంజీయూ ప్రైవేట్ బీఈడీ కళాశాలల అసోసియేషన్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు నిర్ణయించాయి. దీంతో తొలిరోజు బంద్ ప్రశాతంగా సాగింది. కాగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లా కేంద్రాల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాల ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. పాలమూరులో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డికి, వనపర్తిలో ఎమ్మెల్యే పీఏకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలు మూతపడ్డాయి. శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ యాజమాన్య సంఘం (సుప్మా) కరీంనగర్ పట్టణ అధ్యక్షుడు గోవిందవరం కృష్ణ ఆధ్వర్యంలో యాజమాన్యాల బాధ్యులు, అధ్యాపకులు స్థానిక తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో ఇటు యాజమాన్యాలు, అటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.