Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ప్రణయ్ శశాంక్ (22) బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు అతన్ని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రణయ్ చివరి సంవత్సరం మొదటి సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యారు. దీంతో రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుని పాసైతాననే విశ్వాసంతో సప్లిమెంటరీ పరీక్షకు సైతం హాజరు కాలేదు. తీరా రీవాల్యుయేషన్లో సైతం పాస్ కాలేకపోయాడు. ఇటీవల విడుదలైన గేట్ ఫలితాల్లో ఉత్తమ స్కోర్ సాధించిన ప్రణయ్‌కు పీజీలో, ఐఐటీల్లో ప్రవేశం పొందే అవకాశం లభించింది. అంతకు ముందుగానే అతడు ఆన్లైన్లో ఓ కోర్స్ పూర్తి చేశాడు. దానిని పరిగణనలోకి తీసుకొని క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా తనను పాస్ చేయాలని కోరారు. దీనికి అధికారులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణయ్ హాస్టల్ కి వెళ్లి బుధవారం సాయంత్రం ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్నేహితులు అతన్ని దుర్గాబాయ్ దేశముఖ్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు గురువారం ఉదయం కళాశాలలో ఆందోళనకు దిగారు. అధికారుల వైఖరితోనే ప్రణయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినదించారు.
ఇతర యూనివర్సిటీలో క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు తమ కళాశాలలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. ప్రణయ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమేష్ కుమార్ వివరణ ఇస్తూ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని స్పష్టం చేశారు. నియమ నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ ట్రాన్స్ఫర్ సాధ్యపడదని చెప్పారు. తాము ఇష్టారీతిన ఏదీ చేయడానికి వీలుండదని, నిబంధనలకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రణయ్ ఉదంతంపై అధికారులు సమావేశమై చివరి సంవత్సరం విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను మరోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.