హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 25: హనుమకొండలోని ఏకశిల జూనియర్ కాలేజీ హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల క్యాంపస్ వద్ద ఆందోళనలు చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాంధన్‌తండాకు చెందిన గుగులోత్ శ్రీదేవి (16) హనుమకొండ డబ్బాల ప్రాంతంలోని ఏకశిల గర్ల్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నది. మంగళవారం రాత్రి 9 గంటలకు కాలేజీ హాస్టల్లో ఉరివేసుకోగా గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీదేవిని ఎంజీఎం దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధ్దారించారు. కాలేజీ యాజమాన్యం వేధింపులే మృతికి కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు అర్ధరాత్రి మృతదేహంతో కాలేజీ ఎదుట బైఠాయించారు.
కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేయూ, సుబేదారి, హనుమకొండ పోలీసుల బలగాలతో పహారా నిర్వహించారు. బుధవారం బాయ్స్ క్యాంపస్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ క్యాంపస్‌పై రాళ్లు వేయడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దీంతో కేయూ పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అకడి నుంచి గర్ల్స్ క్యాంపస్‌కు చేరుకున్న విద్యార్థి సంఘాల నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి ఏకశిల కాలేజీ అనుమతులను రద్దు చేయాలని కోరారు.
రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ప్రైవేట్ సూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే నగరంలోని ప్రైవేట్ కాలేజీల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు. శ్రీదేవి మృతిపై సమగ్ర విచారణ జరిపి కాలేజీ యాజమాన్యం, కరస్పాండెంట్ గౌరు తిరుపతిరెడ్డిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు కాజీపేట ఏసీపీ తిరుమల్‌కు వినతిపత్రం అందజేశారు. పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారావు, ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషబోయిన సంతోష్, ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ మానసిక ఒత్తిళ్లకు గురిచేయడంతో ఇంటర్ విద్యార్థిని శ్రీదేవి కాలేజీలో ఉరివేసుకుందని పేర్కొన్నారు. శ్రీదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.