కలెక్టరేట్, డిసెంబర్ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ అంటూ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మరోసారి తన గాత్రం వినిపించారు. నగరంలోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థిని సింధుశ్రీతో కలిసి ఈ పాట పాడగా, దివ్యాంగులకు స్ఫూర్తిగా మారింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగుల కోసం రూపొందించిన దివ్యదృష్టి యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేశారు. సినీగేయ రచయిత చంద్రబోస్ 2009లో విడుదలైన ‘నింగీ.. నేలా నాదే’ అనే సినిమా కోసం రాసిన ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత?’ అనే పాటను ఆలపించారు. గతంలో ఓ కార్యక్రమంలో అంధవిద్యార్థిని సింధుశ్రీ పాడిన పాట స్ఫూర్తితో మూడు రోజుల క్రితం తన చాంబర్లో పాడుతుండగా, అంధుల పాఠశాల సంగీతోపాధ్యాయురాలు సరళ, మ్యూజిక్ డైరెక్టర్ కేబీ శర్మ ఆధ్వర్యంలో రికార్డు చేశారు. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. భ్రూణ హత్యలను నివారించే క్రమంలో ఆడపిల్లను రక్షించుకుందామంటూ గతంలో కూడా ఓ చిన్ని పిచ్చుక అనే పాట పాడారు.