రాజన్న సిరిసిల్ల : దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహా శివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. క్షేత్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి జాతర మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా వేములవాడ ఆలయంలోని ఓపెన్ స్లాబ్‌లో శనివారం కలెక్టర్ వివిధశాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయాశాఖల అధికారులు వారికి అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
జాతరలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధితశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు, పారామెడికల్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించాలని, అలాగే అంబులెన్స్‌లను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. దోమల నివారణకు ఫాగింగ్, స్ప్రే చేయాలని ఆదేశించారు. వైద్య శిబిరాల్లో మాస్క్‌లు, శానిటైజర్లు, థర్మామీటర్లు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. వీలైతే కొవిడ్ టీకాలు వేయాలన్నారు. దేవస్థానం క్యూలైన్లు, పరిసర ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలని, వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా భక్తులకు తాగునీటి వసతి కల్పించడంతో పాటు పారిశుధ్య నిర్వహనపై దృష్టి పెట్టాలని మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 126 పర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయని, మరొక 60 తాత్కాలిక టాయిలెట్స్ జాతర కోసం ఏర్పాటు చేస్తామన్నారు.
ఆర్టీసీ అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బస్సులు నడుపాలని, యాత్రీకుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్ సర్వీసులు నడుపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో బస్సుల సంఖ్య పెంచేలా చూడాలని, ఉచిత బస్సుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అలాగే బస్టాండ్‌లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలన్నారు. అన్ని పార్కింగ్ స్థలాల వద్ద కంట్రోలర్స్, సిబ్బందిని ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూముల వద్ద ప్రజా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి.. అనౌన్స్మెంట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు నిలిపే చోట్ల మౌలిక వసతులు కల్పించాలని, శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు.
పోలీస్‌శాఖ సహకారంతో పార్కింగ్ చోట్ల వాహనాల రాకపోకలకు వేర్వేరుగా దారులు ఏర్పాటు చేయాలన్నారు. జాతర నేపథ్యంలో రోడ్లను శుభ్రంగా ఉంచాలని, స్పీడ్ బ్రేకర్లకు రంగులు వేయాలని, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే వసతి సౌకర్యాలకు సంబంధించి చలువ పందిళ్లు వేయాలని, లైటింగ్, తాగునీటి వసతి కల్పించాలన్నారు. జాతరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని సెస్ అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, ట్రాఫిక్ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను అనురాగ్ జయంతి ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, బీ సత్యప్రసాద్, ఆలయ ఈఓ రమాదేవి, వేములవాడ ఆర్డీఓ వి లీల, డీఎస్పీ చంద్రకాంత్, సంబంధిత ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.