ఆదిలాబా: ఆసియాలో రెండో అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేశ్లాపూర్కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జాతరలో కీలక ఘట్టమైన దర్బార్ నేడు జరుగనుంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఏటా జాతరలో గిరిజనుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ దర్బార్‌ను ఏర్పాటు చేస్తారు.
ఉట్నూర్ ఐటీడీఏ అధికారులతో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు గిరిజనుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సమస్యల పరిష్కారం చేస్తారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం,జిల్లాకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ దర్బార్‌కు హాజరవుతారు. కాగా, శనివారం బేతల్ పూజలు, మండగాజిలింగ్, ఆదివారం షాంపూర్ జాతర జరుగనున్నాయి.
జాతర 3వ రోజున దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహిస్తారు. సమస్యలను నేరుగా అధికారులు-ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది. 1942లో నాగోబా దర్బార్ మొదటిసారిగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం హైమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ జరిగింది. అడవిబిడ్డల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆనాడు హైమన్ డార్ఫ్ ను నిజాం సర్కార్ పంపిన విషయం తెలిసిందే. హైమన్ డార్ఫ్ ప్రారంభించిన దర్బార్ నేటికీ కొనసాగుతున్నది.