ఇల్లెందు, ఫిబ్రవరి 20: ఆయన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పట్టి మట్టిని తవ్వి, పారతో మట్టిని తట్టలో ఎత్తి మోశారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ (Jitesh V Patil). గురువారం ఉదయం కలెక్టర్ జితేష్ పాటిల్.. టేకులపల్లి మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రు తండా, కొత్త తండా గ్రామపంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పారా పట్టి పారం పాండు పనుల్లో పాల్గొన్నారు. స్వయంగా మట్టిని తట్టలోకి ఎత్తి దానిని మోశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకి భూగర్భ జలాలు ఉండాలంటే ప్రతి రైతు వ్యవసాయ భూములలో పారం పాండు నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఉపాధి కూలీల సాధకబాధకలు తెలుసుకున్నారు. పలు గ్రామాలలో విద్యుత్ సమస్య, పోడు భూముల్లో విద్యుత్ సమస్యల గురించి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు.
ప్రస్తుతం రైతులకు మిర్చి వాణిజ్య పంటలే కాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చే మునగ సాగు, వెదురు సాగుపై అవగాహన కల్పించారు. పలు గ్రామాలలో మునగ సాగు క్షేత్రాన్ని పరిశీలించారు. మునగ సాగుపై అధిక లాభం సాధించవచ్చని సూచించారు. కలెక్టర్‌తోపాటు డీఎల్పీఓ రమణ, మిషన్ భగీరథ డీఈ పద్మావతి, విద్యుత్ శాఖ డీఈ రంగస్వామి, ఎంపీడీవో రవీందర్ రావు, ఎంపీ ఓ గణేష్ గాంధీ, ఏపీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ బుజ్జి కన్నయ్య, ఆయా పంచాయతీల కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు ఉన్నారు.