కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఆగస్టు 25, 2023 : జిల్లాలోని 18 సంవత్సరాలు వయసు నిండిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం కలెక్టర్ హేమంత్ సహదేవరావు ఆయన సతీమణి రేవతితో కలిసి ఫారం-6ను బూత్ స్థాయి అధికారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉన్నందున జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తమ వివరాలు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందాలని సూచించారు. ఓటర్ నమోదు కార్యక్రమంలో జిల్లాలో ప్రథమ స్థానంలో ఉంచే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, జిల్లాలో వయసు అర్హత గల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.