హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత గత పదేండ్లలో దాదాపు 56 కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటయ్యాయి. ఆయా పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారి కోసం ప్రభుత్వం సబ్సిడీ ధరకు భూములను కేటాయించింది. ఇందులో చాలామంది ఇదివరకే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగా, ఇంకా అనేకమంది వివిధ కారణాలతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేక పోయారు. బ్యాంకుల నుంచి రుణ సహాయం, భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, సాంకేతికత సమకూర్చుకోవడం, మార్కెంటింగ్ అంశాల వల్ల జాప్యం జరిగినట్టు చెప్తున్నారు.
ఇవన్నీ సమకూర్చుకొని ఇప్పుడు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తుంటే వారికి స్థానిక నేతల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమకు కొంత సమర్పించుకుంటే తప్ప నిర్మాణాలు ముందుకు సాగవని పారిశ్రామికవేత్తలను భయాందోళనకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా మేడ్చల్, పటాన్చెరు జోన్ల పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. చందన్వల్లి, కర్కపట్ల బయోటెక్ పార్క్, బండ తిమ్మాపూర్ జనరల్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి, కుచారం, బండ మైలారం, తునికి బొల్లారం, వర్గల్, మందపల్లి, పాశమైలారం, శివనగర్ తదితర ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్థానిక నేతల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్న ఆరోపణలున్నాయి.
టీజీఐఐసీకి బాధితుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా.. వారు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఒక్కసారి భూమి విక్రయించిన తరువాత పరిశ్రమ ఏర్పాటు చేసుకునే బాధ్యత కొనుగోలుదారుపై ఉంటుందని, భూమికి సంబంధించి ఏమైనా న్యాయపరమైన, టైటిల్ పరమైన ఇబ్బందులు తలెత్తుతే మాత్రమే తాము జోక్యం చేసుకుంటామని టీజీఐఐసీ అధికారులు చెప్తున్నారు. నాయకులు పెట్టే ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకోవాలని సలహా ఇస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే భూముల కేటాయింపు జరగగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అటు అధికారులు కానీ, ఇటు నాయకులు గానీ వారిని ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు లేవు. పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండటంతో పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టే సాహసం చేయలేదు.