కూసుమంచి(నేలకొండపల్లి), డిసెంబర్ 1 : కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) (Banoth Veeranna) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది. పీజీ చదివినా ఉద్యోగం రాలేదని వ్యవసాయాన్నే నమ్ముకుంటే.. కౌలు గిట్టుబాటు కాక, అప్పులు భారాన్ని మోయలేక ఇంటిని, ఇల్లాలినీ కూడా వదిలి వెళ్లేంతగా కుమిలిపోయాడు. ‘అన్నం పెట్టే అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారని, కౌలు రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలి’ అని వేడుకుంటూ గత నెల 29న పురుగుల మందు తాగిన కౌలు రైతు వీరన్న.. చికిత్స పొందుతూ గత నెల 30న ప్రాణాలు విడువడం ద్వారా తన వ్యథ అందరికీ తెలిసేలా చేశాడు. ఈ ఘటనతో ఆ యువ రైతు స్వగ్రామం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరితండా తీవ్ర విషాదంలో మునిగింది. వీరన్న బిడ్డ, భార్య, తల్లి పరిస్థితి చూసి, అయ్యో ఆ కుటుంబానికి ఎంత కష్టం వచ్చిందంటూ తల్లడిల్లింది.
కలచివేస్తున్న కర్షకుడి కుటుంబ వేదన
ఉండేందుకు సరైన ఇల్లు లేక, ఏడాది వయసున్న చంటి పిల్లవాడికి తండ్రి లేక, వృద్ధ తల్లిదండ్రులకు కొండంత అండగా ఉండే కొడుకు లేక.. అతడి కుటుంబం చేస్తున్న ఆర్తనాదాలు అత్యంత దయనీయంగా ఉన్నాయి. అక్కడి సన్నివేశాలను చూసిన ప్రతి ఒక్కరినీ కంటితడి పెట్టిస్తున్నాయి. తన కొడుకు నమ్ముకున్న వ్యవసాయమే తమను నట్టేట ముంచిందని, ప్రభుత్వమూ తమను ఆదుకోలేకపోయిందని వీరన్న తల్లి గుండెలోతుల్లోంచి వెక్కివెక్కి ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కళ్లు చెమర్చేలా చేసింది. కౌలు రైతు వీరన్న ప్రాణాలు విడిచిన రెండో రోజైన సోమవారం రాత్రి.. ఏడాది వయసున్న చంటి పిల్లాడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని వెలుతురులేని వసారాలో వీరన్న భార్య విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేసింది. తన తండ్రి తమను ఒంటరిని చేసి ఈ లోకాన్ని వీడాడని, అందుకే తన తల్లి, తన నానమ్మ, తన తాతయ్య గుండెలవిసేలా బోరున విలపిస్తున్నారని తెలియని పసితనంతో అందరి మొఖాలూ చూస్తున్న ఏడాది వయసున్న వీరన్న కొడుకును ప్రతి ఒక్కరూ చూసి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు పూర్తయిన కౌలు రైతు బానోత్ వీరన్న నివాసమంతా అంతులేని విషాదమే.
ఏడడుగులు వేసి… రెండేండ్లలోనే దూరమై
గ్రామస్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల కథనం.. బానోత్ వీరన్న నిరుపేద గిరిజన యువ రైతు. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. తల్లి బోడమ్మ. తండ్రి బాలా. తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండేండ్ల క్రితమే వీరన్నకు సాలమ్మతో వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పీజీ వరకూ చదువుకున్న వీరన్న ఈ మధ్యకాలం వరకూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎస్ఐ పోస్టు కోసం ప్రయత్నం చేసినా సాధించలేకపోయాడు. దీంతో వ్యవసాయం చేసైనా కుటుంబాన్ని పోషించుకోవాలనుకున్నాడు. తండ్రికి ఉన్న అర ఎకరం పొలంలో సాగు మొదలుపెట్టాడు. తొలుత నష్టం వచ్చింది. అర ఎకరంతో కుటుంబాన్ని పోషించడం కష్టమని భావించి.. నాలుగేండ్ల కిందట రెండు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. కాస్త లాభసాటిగా ఉండడంతో కౌలు భూమిని విస్తీర్ణాన్ని క్రమంగా పెంచాడు. ఈ ఏడాది సొంతంగా పదిన్నర ఎకరాలు, పొత్తులో ఎనిమిది ఎకరాలు కౌలుకు చేస్తున్నాడు.
ఎంతో ఉత్సాహంగా వాటిలో పత్తి, మిర్చి, వరి, చెరకు పంటలు వేశాడు. తుఫాన్లు, వరదల కారణంగా పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కొద్దోగొప్పో చేతికొచ్చినా సరైన ధర దక్కకపోవడంతో వాటి కోసం తెచ్చిన రూ.15 లక్షల అప్పులు మిగిలాయి. అవి తీర్చేమార్గం కనిపించకపోవడంతో కొంతకాలంగా తీవ్రంగా కుంగిపోయాడు. పంటలను తుఫాన్లు తుడిచి పెట్టుకుపోవడంతో ఇక అప్పులు తీర్చడం కష్టమని భావించాడు. గత నెల 29న తాను కౌలుకు చేస్తున్న చేను వద్దకు వెళ్లాడు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. కౌలు రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు చెల్లించలేని కౌలు రైతులను భూ యజమానులు కూడా కనికరించాలని వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు అతడిని అదే రోజు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గత నెల 30న ప్రాణాలు విడిచాడు. సోమవారం స్వగ్రామంలో అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేని నిరుపేద కౌలు రైతు వీరన్నకు ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రస్తుతం అది నిర్మాణ దశలో ఉన్నది. దాని గోడకు పరదా కట్టుకొని అతడి కుటుంబమంతా అక్కడే వెళ్లదీస్తోంది. ఈ క్రమంలో అతడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో అతడి కుటుంబం తల్లడిల్లిపోతున్నది.
ఆత్మహత్యపై వివరాల సేకరణ
వీరన్న ఆత్మహత్యపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఖమ్మం జిల్లా వ్యవసాశాఖ అధికారి పుల్లయ్య స్పందించారు. వివరాలు సేకరించాలని మండల అధికారులను ఆదేశించారు. ఏవో రాధ తన సిబ్బందితో కలిసి తండాకు వెళ్లి వీరన్న ఆత్మహత్యకు కారణాలు, అప్పుల వివరాలు తెలుసుకున్నారు. తహసీల్దార్ వెంకటేశ్వర్లు కూడా వీరన్న అప్పు పత్రాలు పరిశీలించారు. తండాలోని మిగతా కౌలు రైతులనూ విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు.
“నేనెట్ల బతకాలె? బిడ్డనెట్ల చూసుకోవాలె? అత్తామామలనెట్ల సాకాలె? అప్పులెట్ల తీర్చాలె? మమ్ముల ఎందుకిడిశి పోయినవయ్యా?”
– గుండెలు పగిలే దుఃఖంతో వీరన్న భార్య సాలమ్మ