వరంగల్ చౌరస్తా : కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టుంది వరంగల్ ఎంజీఎం దవాఖానలో పరిస్థితి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వస్తే ఎప్పడు ఎక్కడ ఏది మీద పడుతుందోననే భయం రోగుల్లో కనిపిస్తున్నది. శుక్రవారం ఉదయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని సర్జికల్ విభాగానికి వెళ్లేదారిలో ఒక్కసారిగా భారీశబ్దంతో భవనం పైకప్పు ఊడిపడింది. ఆ సమయంలో దారి వెంట ఎవరూ వెళ్లకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆరోగ్యశాఖ కమిషనర్ తనిఖీలకు వస్తుండగా ఈ ఘటన జరగడంతో వైద్యాధికారులు అప్రమత్తమై వెంటనే పారిశుధ్య చర్యలు చేపట్టాలని శానిటేషన్ విభాగాన్ని ఆదేశించారు.
ఓపీ విభాగం నుంచి డైట్‌కి వేళ్లే సమయానికి అటుగా వెళ్లే దారికి అడ్డుగా కర్టెన్స్టాండ్ను ఏర్పాటు చేసి దారిని మూసేశారు. గతంలో సైతం ఆంకాలజీ, ఆర్ఐసీయూ విభాగాల్లో పెచ్చులు ఊడిపడినప్పటికీ అధికారులు మరమ్మతు పనులు చేపట్టకపోవడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.