Cold Wave | హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఆరు రోజులపాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠంగా 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
డిసెంబర్ 31 వరకు సాధారణ శీతాకాలం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై, జనవరి 1 నుంచి పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పలుచోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదు కావడంతో ప్రజానీకం వణికిపోతున్నారు. జనవరి ప్రారంభంలో వాతావరణం.. సాధారణ శీతాకాలం మాదిరిగానే ఉంటుందని, మళ్లీ సంక్రాంతి నాటికి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 7.3 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.