Cognizant | హైదరాబాద్, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయిలో ఐటీ రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికతో ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇరవై వేలమంది ఉద్యోగులుండేలా పది లక్షల చదరపు అడుగుల స్థలంలో ఈ సెంటర్‌ను స్థాపించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌తోపాటు కంపెనీ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీని విస్తరించడం సంతోషంగా ఉందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్ రవికుమార్ తెలిపారు. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు.