45 ఏళ్ల తర్వాత పీజీ కళాశాలలోమహిళలు చదివేందుకు అవకాశం
పూర్వ విద్యార్థి, కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యేక చొరవతో కళాశాలకు పూర్వ వైభవం
సంతోషం వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
Mirzapur PG College | జహీరాబాద్, సెప్టెంబర్ 24 : ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ పీజీ కళాశాలకు పూర్వ వైభవం సంతరించుకోనుంది. 1980లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మీర్జాపూర్ బి గ్రామంలో విశాలమైన స్థలంలో పీజీ కళాశాలతో పాటు అధ్యాపకులు, విద్యార్థులకు వసతి సౌకర్యాలను కల్పిస్తూ ఏర్పాటు చేశారు. ఈ పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ కోర్సుల్లో 40 మంది చొప్పున సీట్లను కేటాయించారు. అప్పటినుండి స్థానిక కళాశాలలో హాస్టల్లో ఉంటూ ఆయా కోర్సుల్లో పురుష విద్యార్థులు చదువు కుంటున్నారు. కొన్ని సంవత్సరాల పాటు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో మూతపడే దశకు చేరుకుంది. దీంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. కళాశాలను పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను, కో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత అధికారులకు సైతం వినతి పత్రాలను అందజేశారు. ఈ దశలో పీజీ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి, స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివశంకర్ పీజీ కళాశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడే పరిస్థితుల్లో ఉన్న పీజీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కళాశాల పరిస్థితులు వివరించారు. ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఏర్పాటు చేస్తే జిల్లాలో పీజీ చదువుకునే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నత అధికారులు సానుకూలంగా స్పందించారు.
దాదాపు 45 సంవత్సరాల తర్వాత స్థానిక పీజీ కళాశాలలో కో ఎడ్యుకేషన్ చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. పురుష విద్యార్థులకు స్థానికంగా హాస్టల్ వసతి ఉండగా, మహిళ విద్యార్థులకు డే కం రెసిడెన్షియల్ విధానంతో తరగతిలో కొనసాగనున్నాయి. మహిళ విద్యార్థినిలు పీజీ కోర్సులు చదవాలంటే హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో ఉంది. స్థానిక పీజీ కళాశాలలో కో ఎడ్యుకేషన్ కల్పించడంతో మహిళ విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడనుంది.
ఆయా కోర్సులే కాకుండా కొత్తగా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కోర్సు అనుమతి ఇవ్వాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు నివేదికలను అందజేశారు. అలాగే ప్రస్తుతం ఉద్యోగ విద్య రంగాల్లో డిమాండ్ ఎంబీఏ కోర్సు కూడా స్థానిక కళాశాలలో కల్పించేలా చూడాలని ఉన్నత అధికారులకు స్థానిక ప్రిన్సిపల్, అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి ఆయా కోర్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయా కోర్సులు కూడా త్వరలోనే కళాశాలలో విద్యార్థులు చదువుకునేందుకు అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ 45 సంవత్సరాల తర్వాత పీజీ కళాశాలకు పూర్వ వైభవం వస్తుండడంతో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు నాయకులు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కళాశాలలో అడ్మిషన్ పెరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ప్రిన్సిపాల్ డాక్టర్ శివశంకర్
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక పీజీ కళాశాల ఉన్న మిర్జాపూర్ బి ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఒకప్పుడు స్థానిక కళాశాలలో తాను చదువుకున్నానని, అలాంటి కళాశాలకు ప్రిన్సిపల్ గా రావడం చాలా సంతోషంగా ఉందని, మూతపడే దశలో ఉన్న కళాశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కళాశాలకు కో ఎడ్యుకేషన్ మంజూరు చేయించాం. కేవలం పురుష విద్యార్థులు చదువుకునే ఈ కళాశాలలో మహిళ విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకున్నాం. ఇటీవల నిర్వహించిన సీపీగేట్ పరీక్ష పరీక్ష హాజరై అత్యధిక మార్కులు సాధించి సాధించిన విద్యార్థులు కౌన్సిలింగ్లో ఆప్షన్ ఎంచుకొని కళాశాల ప్రవేశాలు పొందాలనీ, దీనికోసం విద్యార్థి సంఘాల నాయకులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఉందని డాక్టర్ శివశంకర్ అన్నారు.