వాణిజ్య వాహనాల అమ్మకాల్లో గణనీయంగా వృద్ధి నమోదు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్జీ) వాహనాలవైపు మొగ్గుతున్నారు. దీంతో వాటి అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ మార్పు ప్యాసింజర్ వాహనాల కంటే కమర్షియల్ వాహనాల విషయంలో ఎక్కువగా కనిపిస్తున్నది. సీఎన్జీతో నడిచే లైట్ కమర్షియల్ వెహికల్స్ (ఎల్సీవీ), స్మాల్ కమర్షియల్ వెహికల్స్ (ఎస్సీవీ) విక్రయాలు భారీగా పెరగడమే ఇందుకు నిదర్శనం. 2021లో ఎల్సీవీ విక్రయాలు 16 నుంచి 43 శాతానికి, ఎస్సీవీ విక్రయాలు 5 నుంచి 33 శాతానికి పెరిగినట్టు టాటా మోటర్స్ వర్గాలు వెల్లడించాయి. 2021 నాటికి మొత్తం కమర్షియల్ వాహనాల్లో కేవలం 3.4 శాతంగా ఉన్న సీఎన్జీ వాహనాల సంఖ్య ఈ నెల 10 నాటికి 16 శాతానికి చేరినట్టు తెలిపారు. సీఎన్జీ వాహనాల నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, డీజిల్ కంటే సీఎన్జీ తక్కువ ధరకు లభ్యమవుతుండటం, ప్రభుత్వ నుంచి ప్రోత్సాహకాలు లభిస్తుండటం ఇందుకు కారణమని చెప్పారు.
ఇంధన ఖర్చులో భారీ తేడా
ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా, కిలో సీఎన్జీ ధర రూ.69 గా ఉన్నది. ఈ లెక్కన లీటర్ డీజిల్‌తో 7 కి.మీ. నడిచే మీడియమ్-డ్యూటీ ట్రక్కు వెయ్యి లీటర్ల డీజిల్‌తో 7 వేల కి.మీ. దూరం ప్రయాణించేందుకు రూ. 94,620 ఖర్చవుతున్నది. మరోవైపు సీఎన్జీ మైలేజీ డీజిల్‌తో దాదాపు సమానంగా ఉన్నది. ఈ లెక్కన సీఎన్జీ వాహనం వెయ్యి కిలోల ఇంధనంతో 7 వేల కి.మీ. దూరం ప్రయాణించేందుకు అయ్యే ఖర్చు రూ.69 వేలే. ఇది డీజిల్ వాహనానికయ్యే ఇంధన ఖర్చు కంటే దాదాపు రూ.25 వేలు తక్కువ. దీంతో చాలా మంది తమ పాత డీజిల్ వాహనాలను మార్చుకొని సీఎన్జీ వాహనాలను బుక్ చేసుకొంటున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
సీఎన్జీ సహా పర్యావరణ హితమైన వాహనాలకు ప్రభుత్వం పన్నుల్లో రాయితీలు కల్పిస్తున్నది. కొనుగోలుదారులు సీఎన్జీ వాహనాలవైపు మొగ్గుచూపడానికి ఇది మరో కారణమని వాహన డీలర్లు తెలిపారు. రానున్న రోజుల్లో సీఎన్జీ కమర్షియల్ వాహనాలకు గిరాకీ మరింత పెరుగుతుందని, ప్రత్యేకించి తక్కువ దూరం ప్రయాణించే వాహనాల విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు. డీజిల్‌తోపాటు సీఎన్జీ ధర కూడా రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ ఈ రెండింటి మధ్య రూ.20-25 వరకూ తేడా ఉండటంతో సీఎన్జీ వాహనాలే లాభదాయకమని స్పష్టం చేస్తున్నారు.