హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరున నామకరణం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. సోమవారం శాసనమండలిలో మంత్రి దామోదర రాజనర్సింహ తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో సభ్యులు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ కవి, రచయిత, వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సభ్యులు కోదండరాం, మహేశ్‌కుమార్ గౌడ్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఏవీఎన్ రెడ్డి మాట్లాడారు.
పేరు మార్పుపై అసెంబ్లీలో రగడ!
తెలుగు యూనివర్సిటీ పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేర నామకరణం చేసేందుకు ఉద్దేశించిన బిల్లుపై సోమవారం అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలుపగా.. కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులు సమర్థించారు. చర్చ సందర్భంగా ఎంఐఎం సభ్యుడు బలాలా చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం సృష్టించాయి. సోమవారం బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనందున పేరు మార్పు అనివార్యమైనట్టు, రెండు ప్రాంతాల్లో ఒకే పేరుతో రెండు యూనివర్సిటీలు ఉంటే పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని పేరు మార్చుతున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పేరు మార్పు అంశానికి కొందరు కులాల రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని కాదన్నారు. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు, బల్కంపేట నేచర్‌క్యూర్ దవాఖానకు మాజీ సీఎం రోశ య్య పేరు పెడతామని వెల్లడించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ అనుమతులు తీసుకొస్తే చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని స్పష్టంచేశారు. ఈమేరకు కేంద్రమంత్రికి లేఖ రాశారు.
పేర్ల మార్పుపై సిగ్గులేకుండా చర్చ : బలాలా
బీజేపీ సభ్యుల డిమాండ్‌పై ఎంఐఎం సభ్యుడు బలాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చర్లపల్లి స్టేషన్ పేరు మార్చాలని, ఏదో ప్రాంతం పేరు మార్చాలని సిగ్గులేకుండా చర్చిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తూ బలాలా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా పేరు మార్పును సమర్థిస్తున్నట్టు తెలిపారు.
ఓయూకు సురవరం పేరు పెట్టాలి : మహేశ్వర్‌రెడ్డి
బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పెట్టాలనడం సరికాదని, తెలుగు యూనివర్సిటీ పేరును పొట్టి శ్రీరాములు పేరున కొనసాగిస్తూ.. ఉస్మానియా వర్సిటీ పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని కోరారు.
ఆర్యవైశ్యులను అవమానిస్తున్న ప్రభుత్వం : సత్యనారాయణ
ప్రభుత్వ నిర్ణయం ఆర్యవైశ్యులను అవమానించడమేనని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. భాషా ప్రాతిపదికన రాష్ర్టాల ఏర్పాటుకోసం పొట్టిశ్రీరాములు 55 రోజులు నిరాహారదీక్ష చేసి అమరుడైన విషయాన్ని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తి పేరు మార్చడం శోచనీయమని పేర్కొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరును కొత్త యూనివర్సిటీలకు పెట్టాలని, లేదంటే ఉస్మానియా వర్సిటీకి పెట్టాలని సూచించారు.