అచ్చంపేట/అచ్చంపేట రూరల్, అక్టోబర్ 11 : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు మాఫీ కాలేదని, ఆ సొమ్మును తిరిగి చెల్లించాలని కొందరికి అచ్చంపేట ఏపీజీవీబీ నుంచి నోటీసులు అందాయి. ఇందుకు సంబంధించి ‘మాఫీ సొమ్ము.. వాపస్ కట్టండి’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి సీఎంవో, వ్యవసాయ శాఖ కమిషనర్, కలెక్టరేట్ నుంచి అధికారులు ఆరా తీయడంతో వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఏఈవో రవితేజ సింగారం గ్రామానికి చేరుకొని నోటీసులు అందుకున్న రైతులను కలిశారు. వారితో మాట్లాడి సంబంధిత భూమి పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు సేకరించారు. బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ గురించి తెలుసుకొని రైతులకు తెలియజేస్తామని చెప్పారు. ఈ గ్రామంలో దాదాపు వెయ్యి మందికిపైగా రైతులు ఉండగా.. వారిలో 40 శాతం వరకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ జరిగిందని, 20 శాతం మంది రైతులకు రేషన్ కార్డులు లేకపోవడంతో వివరాలు తీసుకున్నామని ఏఈవో తెలిపారు. మిగిలిన వారికి రుణమాఫీ జరిగిందని ఆయన ‘నమస్తే’కు వివరించారు.