హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): సౌర విద్యుదుత్పత్తిలో విజయవంతంగా ముం దుకు సాగుతున్న సింగరేణి సంస్థ.. రెండో దశలో 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ల ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 8 ప్రాంతాల్లో ప్లాంట్లు నెలకొల్పడానికి విధివిధానాలు ఖరారు చేసింది. వచ్చే నెలలో టెండర్లు పిలవాలని, అక్టోబర్ నుంచి నిర్మాణాలు ప్రారంభించాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు. శుక్రవారం సింగరేణి భవన్లో సింగరేణి విద్యుత్తుపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. మొదటి దశలో చేపట్టిన 300 మెగావాట్లలో మిగిలిన 76 మెగావాట్ల ప్లాంట్లను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని, రెండో దశలో చేపట్టను న్న 240 మెగావాట్ల ప్లాంట్లను వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. తద్వారా మొత్తం 540 మెగావాట్లతో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా సింగరేణి నిలుస్తుందని తెలిపారు. మందమర్రిలో 67.5 మెగావాట్లు, రామగుండం-3లో 41 మెగావాట్లు, ఎస్టీపీపీలో 37.5 మెగావాట్లు, సత్తుపల్లిలో 32.5 మెగావా ట్లు, శ్రీరాంపూర్‌లో 27.5 మెగావాట్లు, ఇల్లందు లో 15 మెగావాట్లు, భూపాలపల్లిలో 10 మెగావాట్లు, రామగుండం-1లో 5 మెగావాట్ల ప్లాం ట్లను నెలకొల్పాలని నిర్ణయించారు. సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం పనితీరుపైనా సమీక్షించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.