హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థలో అలసత్వాన్ని ఉపేక్షించబోమని, ఉద్యోగులు, కార్మికులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సీఎండీ ఎన్ బలరాం హెచ్చరించారు. సంస్థ ఉన్నతి కోసం శ్రమించే వారికే చోటు ఉంటుందని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి సంస్థలో స్థానం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. సింగరేణి భవన్లో సోమవారం 11 ఏరియాల జీఎంలు, 39 గనులకు సంబంధించిన ప్రాజెక్ట్ అధికారులు, ఏజెంట్లతో తొలిసారిగా సమీక్షించిన సీఎండీ.. నిర్దేశిత లక్ష్యాలు, పురోగతిపై ఆరాతీశారు. పలు సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కరించకపోవడంపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల్లో స్కిల్‌డెవలప్‌మెంట్, గనుల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. రోజుకు 8 గంటలు పనిచేయాలని, మస్టర్ వేసి విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ పాల్గొన్నారు.
తునికాకు ఫ్రూనింగ్ చేపట్టాలని ధర్నా
టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి వెంటనే తునికాకు ఫ్రూనింగ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ అటవీ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. తునికాకు సేకరణ ప్రక్రియను ప్రారంభించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు.