SLBC Tunnel Collapse | హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ఏడు నిమిషాల్లోనే అందులో చిక్కుకున్న ఎనిమిది మంది చనిపోయినట్టు అధికారులు ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. ప్రమాదం జరిగి నెల రోజులు గడిచినందున మృతదేహాలు కూడా లభించడం కష్టమేనన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇకపై కూలీల అనవాళ్లు గుర్తించటానికి మాత్రమే సహాయ చర్యలు కొనసాగిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తేల్చి చెప్పేందుకు నివేదిక రూపొందించినట్టు తెలిసింది.
ఘటనలో చిక్కుకున్న వారి కోసం ర్యాట్‌హోల్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి, ఆర్మీ సహా కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ నుంచి వచ్చిన క్యాడవార్ డాగ్స్ సాయంతో అనుమానిత ప్రాంతాలను గుర్తించి తవ్వకాలు జరుపగా టీబీఎం(టన్నెల్ బోర్ మెషిన్) ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించింది. మిగిలిన ఏడుగురి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ నేపథ్యంలో రెస్క్యూ పురోగతిపై సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోపాటు నాగర్‌కర్నూల్ కలెక్టర్, ఎస్పీ, ఎస్ఎల్బీసీ అధికారులు పాల్గొననున్నారు.
సొరంగం కూలిన ఏడు నిమిషాల్లోనే ఎనిమిది మంది మృతిచెందినట్టు అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. నెల రోజులుగా మృతదేహాలు బురదలో కూరుకుపోయినందున ఇప్పటికే కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. ఇదే విషయం నేడు అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మృతదేహాలను గుర్తించి వెలికితీయటానికి మరింత సమయం పట్టనున్నదని, ఇకపై మృతదేహాల కోసం కాకుండా, చనిపోయిన వారి ఆనవాళ్లు గుర్తించేందుకే తమ చర్యలు కొనసాగుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉన్నది.
బాధిత కుటుంబాలు తమవారి కోసం నెల రోజులుగా టన్నెల్ వద్దే పడిగాపులు కాస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన అరుదైనది కావడంతో దేశమంతా సొరంగం వైపే చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ప్రమాదంలో చిక్కుకున్న వారి ఆచూకీపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం మృతదేహాలను కూడా ఇవ్వలేమని అధికారులు నివేదించే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందా? లేక మృతదేహాల ఆనవాళ్లు దొరికే వరకు సస్పెన్షన్ కొనసాగిస్తుందా? వేచి చూడాల్సిందే.