Telangana Schemes | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల తరహాలో మహారాష్ట్రలోనూ అమలు చేయాలని అక్కడి రైతుల చేస్తున్న డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. తెలంగాణ పథకాల అధ్యయనానికి రైతు నేతలు, ప్రభుత్వ అధికారులతో ఓ కమిటీని నియమిస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించారు. దీంతో కొన్ని నెలలుగా తెలంగాణ లాంటి పథకాల కోసం చేస్తున్న పోరాటంలో రైతులు పంతం నెగ్గించుకొన్నట్టయ్యింది. ప్రభుత్వం వేసే కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధేయవాది వినాయక్‌రావ్ పాటిల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మహారాష్ట్ర సర్కారు దిగొచ్చింది. మంగళవారం 14 రైతు సంఘాల నేతలతో సీఎం ఏక్నాథ్ షిండే ముంబైలో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో వినాయక్‌రావ్ పాటిల్‌తో పాటు రాజు శెట్టి, పంజాబ్రావ్ పాటిల్, సికిందర్ షా తదితర రైతు నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో మాదిరిగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తుతోపాటు 65 ఏండ్లు దాటిన రైతులకు నెలకు రూ.5,000 పెన్షన్, పంటలకు మద్దతు ధర ఇవ్వాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తున్నట్టు సీఎం షిండే ప్రకటించారు.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో తన ప్రతాపాన్ని చూపుతున్నది. తెలంగాణలో కొనసాగుతున్న రైతు, ప్రజాసంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేయాలని గాంధేయవాది వినాయక్‌రావ్ ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఏక్నాథ్ షిండే సర్కార్‌ను షేక్ చేసింది. తెలంగాణ మాడల్‌పై చర్చిద్దాం రమ్మని వినాయక్‌రావ్‌ను సీఎం షిండే ఆహ్వానించారు. తెలంగాణలో అమలు చేస్తున్నవిధంగా మహారాష్ట్రలోనూ రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలని, మద్దతు ధరలకు పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంలోని అందరికీ వినాయక్‌రావ్ ఉత్తరాలు రాశారు. ఎవరూ దీనిపై స్పందించకపోవడంతో ఆయన నేరుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదమ్, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గేను వినాయక్‌రావ్ పాటిల్ వద్దకు పంపించి సంఘీభావం ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన మహారాష్ట్ర సర్కార్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా వినాయక్రావ్కు ఫోన్‌చేసి చర్చలకు ఆహ్వానించారు. దీంతో ఆయన తన ఆమరణ దీక్షను విరమించారు.
మహారాష్ట్రలో తెలంగాణ తరహా రైతు సంక్షేమ పథకాలు అమలుచేసేవరకు తమ పోరాటం ఆగదని వినాయక్‌రావ్ పాటిల్ స్పష్టంచేశారు. చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పాన్‌షాప్ నిర్వహించే వ్యక్తికి ఉన్న భరోసా రైతుకు లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పాన్‌షాప్ వ్యక్తి ఎంతో కొంత లాభంతో తన వస్తువులను విక్రయిస్తారని, కానీ రైతుకు మాత్రం ఆ అవకాశం లేదని అన్నారు. అందుకే లాభం వచ్చేవిధంగా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే మళ్లీ ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలపై త్వరలోనే రైతుల సంఘాల నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి చర్చిస్తామని తెలిపారు. తెలంగాణ పథకాలను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై చర్చిస్తామని పేర్కొన్నారు.