ఆంధోల్: తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడని, రైతుబంధు కొనసాగాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, ఆంధోల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ గెలువాలెనని సీఎం కేసీఆర్ అన్నారు. క్రాంతి కిరణ్ గెలిస్తే రైతుబంధు ఉండుడే కాదు, ఎకరానికి రూ.10 వేలుగా ఉన్న రైతుబంధును రూ.16 వేలు చేస్తనని ఆయన హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధోల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు.
‘పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు, మూడు గంటలు చాలు అంటున్నడు. మరె వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సాల్తదా..? చాలదు కాబట్టి 24 గంటల కరెంటు ఉండాలంటే ఏం జెయ్యాలె..? క్రాంతి కిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలె. కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. ఇప్పుడు యాసంగి మడులు తడుపుతున్నరు. ఈ యాళ్లకు రైతుబంధు పడాలె. రైతుబంధు ఎయ్యాలని మేం చెప్పినం. కానీ కాంగ్రోసోళ్లు ఈసీ దగ్గరికి వొయ్యి బంద్ పెట్టాల్నని దరఖాస్తు ఇచ్చిండ్రు. దాంతో ఈసీ రైతుబంధు ఎయ్యకుంట ఆపింది. మళ్ల మేం బొయ్యి ఇది కొత్త పథకం కాదు, మేం ఎయ్యబట్టి ఆరేండ్లాయె. పర్మిషన్ కావాల్నని అడిగినం. దాంతోటి రేపు మంగళవారం రైతుబంధు ఏసేందుకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ కాంగ్రెసోళ్లు మళ్లవొయ్ ఆపాల్నని దరఖాస్తు ఇచ్చిండ్రు. దాంతోటి వచ్చిన పర్మిషన్ రద్దయ్యింది’ అని చెప్పారు.
‘కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక్క రైతుబంధుతోటే బీఆర్ఎస్ గెలుస్తదా..? ఇయ్యాల ఆప్తవ్. ఎన్ని రోజులు ఆప్తవ్..? మూడు తారీఖు అయిపోతే ఓట్లు పడే, లెక్కబెడితే బీఆర్ఎస్ గెలువనే గెలిచే. ఆరు తారీఖు నుంచి మళ్ల దర్జాగా పడుతనే ఉంటది గదా రైతుబంధు. తొండ బిర్రు ఏందాకరా..? అంటే ఎనుగుల దాకా అని ఎన్ని రోజులు ఆపగలుగుతరు రైతుబంధును..? కేసీఆర్ బతికి ఉండంగ రైతుబంధు ఆగుతదా..? అది అయ్యే పనేనా..? కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వచ్చినంక ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తమని మాట్లాడుతున్నరు. భూముల క్రయవిక్రయాల్లో, భూ రికార్డుల్లో అక్రమాలను చూసి వాటికి అడ్డుకట్ట వేసేందుకు నేను ధరణి పోర్టల్ తెచ్చిన. ఇప్పుడు మీరు బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మరొకరి పేరు మీద మారే అవకాశం లేకుండా చేసినం. ముఖ్యమంత్రి తల్చుకున్నా మీ భూమిని ఇంకొకరి పేరు మీదకు మార్చలేడు. ఇగ దీన్ని పోగొట్టకుంటరా..? ఉంచుకుంటరా మీ ఇష్టం’ అని సీఎం అన్నారు.