హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) అధికారులతో మంగళవారం సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల పురోగతిపై అధికారులు సీఎంకు వివరించారు. పవర్లూమ్, హ్యాండ్లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని సీఎం వారికి సూచించారు. పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి ఆరు పాలసీలు రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఎంఎస్ఎంఈ, ఎక్స్పోర్ట్, న్యూ లైఫ్ సైన్సెస్, రివైజ్డ్ ఈవీ, మెడికల్ టూరిజం , గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి మంగళవారం కుటుంబ సమేతంగా బేగంపేటలోని విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని మనవడి తలనీలాలు సమర్పించేందుకే సీఎం తిరుమల వెళ్లినట్టు అధికారులు తెలిపారు. బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని పేర్కొన్నారు.