యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా దమనకాండ కొనసాగింది. ఎక్కడికక్కడ ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాలు అమలై ముఖ్యమంత్రి పర్యటన ముగిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎక్కడివారిని అక్కడే పెద్దఎత్తున ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటారనే కారణంతో బీఆర్ఎస్, బీజేపీతోపాటు కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ పోలీస్స్టేషన్లకు తరలించి రోజంతా అక్కడే ఉంచారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డిని పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద చిరుమర్తి లింగయ్యను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని సొంత నివాసంలో, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డిని గృహ నిర్బం ధం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని బీఆర్ఎస్ నేతలందరినీ ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మూసీకి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించిన రైతుల ను సైతం ముందస్తుగా అరెస్ట్ చేశారు. సంగెం వద్ద వేదికపై ఒక్క సీపీఎం నేతను మాత్రమే మాట్లాడించి.. మిగతా చో ట్ల సీపీఎం, అనుబంధ సంఘాల నేతలను అరెస్ట్ చేశారు.
అంబుజా, ట్రిపుల్ ఆర్ బాధితుల నిర్బంధం
యాదాద్రి జిల్లాలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుపై పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. రామన్నపేట పరిధిలో సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా నిత్యం నిరసనలు, సమావేశాలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు బీఆర్ఎస్ నేతలు, ప్రజలు హెచ్చరించారు. దీంతో ఉదయం నుంచే అరెస్టుల పర్వం కొనసాగింది. అయినా కొందరు ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు పాదయా త్ర, సభాస్థలికి చేరుకున్నారు. ట్రిపుల్ అలైన్మెంట్ మార్చాలని సభలో రైతులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. చౌటుప్పల్‌లో ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతో గుర్రుగా ఉన్న బాధితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. వారంతా రెండు రోజులుగా సీఎంను కలిసి తమ గోడు చెప్పుకోవాలని భావించారు. సుమారు 20 మంది బాధితులను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
భక్తులపైనా ప్రతాపం
సీఎం రేవంత్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో పూజలు చేశారు. ఈ సందర్భంగా సుమారు గంటన్నరపాటు దర్శనాలను నిలిపివేశారు. కొండపైకి వెళ్లకుండా భక్తులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. బస్సులు, ప్రైవేట్ వాహనాలను పైకి వెళ్లనివ్వలేదు. జనం కాలినడక వెళ్లాల్సి వచ్చింది. గుట్టపైన ఉన్న వారిని బస్టాండ్ వద్ద నుం చి కనీసం కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఎంతోపాటు తమను లోనికి అనుమతించాలని కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.