Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుకు, పార్టీకి కులగణనపై పట్టింపులేని విషయం గాంధీభవన్ సాక్షిగా బయటపడింది. పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు కులగణనపై సందేహాలు నివృత్తి చేసేందుకు, అవగాహన కల్పించేందుకు గానూ శుక్రవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గందరగోళంగా మారింది. ముఖ్యమైన కులగణన అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌లోనే ఇతర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు ఉండడంతో నేతలు, కార్యకర్తలంతా ఎటు పోవాలో తేల్చుకోలేక గందరగోళంలో పడ్డారు.
ప్రజెంటేషన్ పూర్తయ్యాక వచ్చిన సీఎం…
ఇటీవల యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన జక్కిడి శివ చరణ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మొదట సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అదే సమయంలో గాంధీభవన్లోపల హాలులో కులగణనపై పార్టీ నేతలకు భట్టి విక్రమార్క పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ ముగిశాక కులగణనపై ప్రజెంటేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అప్పటికే భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ దాదాపుగా పూర్తయింది.
బతిమాలినా పట్టించుకోలే..
భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ పూర్తికాగానే సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సీఎం ప్రసంగం పూర్తికాగానే నేతలు, కార్యకర్తలంతా వెళ్లిపోవడం ప్రారంభించారు. అయితే ఇంకా ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ నేతల్ని, కార్యకర్తల్ని బతిమాలినా పట్టించుకోలేదు. ఒకే సమయంలో రెండు కార్యక్రమాలు నిర్వహించడం, కులగణన ప్రజెంటేషన్‌కు సీఎం ఆలస్యంగా హాజరవడంపై సొంతపార్టీ నేతలు విమర్శలు గుప్పించారు.
ప్రజా సమస్యలపై పోరాడాలి యూత్ కాంగ్రెస్‌కు సీఎం రేవంత్ పిలుపు
నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో శుక్రవారం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివచరణ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన కార్యక్రమం లో సీఎం మాట్లాడారు. పదవులు వస్తాయో రావో తెలియదని, పదవులు ఆశించి పనులు చేయొద్దని చెప్పారు. ఇక ఢిల్లీలో పైరవీలు చేసి పదవులు తెచ్చుకుందామనుకోవటం భ్రమేనని స్పష్టం చేశారు. అలాంటి వాళ్లకు తాను పదవులు ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఫ్లెక్సీలు పెట్టి, దండం పెడితే సరిపోదని, తనకు ఒక దండం పెడితే తాను రెండు దండాలు పెడుతానని, పదవులు మాత్రం ఇవ్వబోమని అన్నారు.