హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రైపోర్టును ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న ఆయన.. శనివారం టోక్యోలో జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని, నీరు మన సంసృతికి, అభివృద్ధికి ప్రతీక అని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్నారని, దీని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని, అందుకే హైదరాబాద్‌లో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని చెప్తున్నానని తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధికి మీ అందరి సహకారం అవసరం. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే ప్రపంచంతోనే మనం పోటీపడొచ్చు. మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు’ అని రేవంత్ తెలిపారు.
జపాన్ ఏజెన్సీలతో ‘టామ్‌కామ్’ ఒప్పందం
హైదరాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్(తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) జపాన్‌కు చెందిన రెండు ఏజెన్సీలతో శనివారం సీఎం సమక్షంలో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఒప్పందం చేసుకున్న ఏజెన్సీల్లో జపాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రత్యేక నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగుల నియామకాల సంస్థ టెర్న్(టీజీయూకే టెక్నాలజీస్), అలాగే, నర్సింగ్, కేర్‌టేకర్ ఉద్యోగాల భర్తీకి రాజ్ గ్రూప్ ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా రానున్న రెండేండ్లలో హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్ తదితర రంగాల్లో 500ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటనలో తెలిపారు.