Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడు అంశాలనే వాళ్లు రోల్‌మాడల్‌గా తీసుకుంటున్నారని, ట్రైనింగ్‌లోనే సెటిల్మెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్ ఆఫ్ కర్మయోగి-మెమొరీ ఆఫ్ ఏ సివిల్ సర్వేంట్’ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో సివిల్ సర్వెంట్స్ ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని ఈ స్థాయిలో ఉంచారని, కానీ ఇప్పుడు వస్తున్నవారు సమాజంలో ఉన్న చెడునంతా రోల్‌మాడల్‌గా తీసుకుంటున్నారని తెలిపారు. కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లను తాను చూస్తున్నానని, ట్రైనింగ్‌లో ఉండగానే సివిల్ పంచాయితీలు తెంచుతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని విమర్శించారు.
నాటి సివిల్ సర్వెంట్ అధికారులతో పోలిస్తే నేటి అధికారుల పనితీరులో చాలా తేడా ఉన్నదని చెప్పారు. తాము ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్లు మూడు తప్పులు చేద్దామంటున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని హితవుపలికారు. అధికారులు ఏసీ రూముల్లోంచి బయటకు వెళ్లేందుకే నిరాకరిస్తున్నారని, ఏసీ అనేది ఏమైనా వ్యాధి ఏమో అని సెటైర్ వేశారు. ప్రస్తుత అధికారుల పనితీరుపై సంతృప్తిగా లేనని స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పక తప్పడం లేదని, ఇప్పటికైనా అధికారుల ఆలోచన, పనితీరు మారాలని, ప్రజలకు చేరువై పని చేయాలని సూచించారు.
నాటి సివిల్ సర్వెంట్ అధికారులతో పోల్చితే నేటి అధికారుల పనితీరులో చాలా తేడా ఉన్నది. శంకరన్, శేషన్, మన్మోహన్సింగ్ లాంటి వాళ్లు ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి దేశాన్ని ఓ స్థాయిలో నిలిపారు. వాళ్ల పేర్లు కూడా కొత్తగా వస్తున్న సివిల్ సర్వెంట్స్‌కు గుర్తుండటం లేదు. ఇప్పటి అధికారులు ఏసీ రూముల్లోంచి బయటకు వెళ్లేందుకే నిరాకరిస్తున్నరు. ఏసీ అనేది ఏమైనా వ్యాధో? ఏమో?
– సీఎం రేవంత్‌రెడ్డి
కొత్త ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సమాజంలో మంచిని కాకుండా చెడునే రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నరు. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే.. ఒకటెందుకు సార్ మూడు చేద్దాం. మళ్లీ మళ్లీ చేయడం ఎందుకు? అన్నీ ఒకేసారి చేద్దాం.. బాగుంటుంది.. బలంగా ఉంటుంది. మళ్లీ రేపు కొత్తగా మూడు తప్పులు చేయొచ్చు అన్నట్టుగా ఉంటున్నరు. ఇది సమాజానికి మంచిది కాదు. ఐపీఎస్‌లు ట్రైనింగ్‌లోనే పోలీస్ స్టేషన్లకు వెళ్లి సివిల్ పంచాయితీలు తెంచుతున్నరు. ఇది చాలా దురదృష్టకరం.
– సీఎం రేవంత్‌రెడ్డి