హైదరాబాద్ సిటీబ్యూరో, గోదావరిఖని, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): వెలమ జాతిని లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఆలిండియా వెలమ అసోసియేషన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెలమ జాతిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం హైదరాబాద్‌లోని ఐవా కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల వెలమ సంఘాల ప్రతినిధులు, వెలమ న్యాయవాదులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మిర్యాలగూడ సభలో రేవంత్‌రెడ్డి వెలమలపై విచక్షణారహితంగా మాట్లాడిన తీరును సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గతంలో కూడా పలుమార్లు వెలమలను అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామ, మండల జిల్లాస్థాయిలో వెలమల ఆత్మగౌరవ నిరసనలు చేపడుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలోని వెలమ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తక్షణమే స్పందించి, రేవంత్‌రెడ్డితో బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వారికి పదవులు ముఖ్యమో, జాతి ఆత్మగౌరవం ముఖ్యమో తేల్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళుతున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో వెలమ సంఘాల ప్రతినిధులు, వెలమ న్యాయవాదులు, కుల పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మూల్యం చెల్లించక తప్పదు
వెలమలను అవమానిస్తే రానున్న రోజు ల్లో తగిన మూల్యం చెల్లించకతప్పదని రామగుండం మున్సిపల్ వెలమ సంఘం నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నడిపెల్లి రామ్మోహన్రావు హెచ్చరించారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో ఉండి వెలమలను టార్గెట్‌గా చేస్తూ దిగజారుడు వ్యాఖ్య లు చేయడం మంచి పద్ధతికాదని హితవుపలికారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.