Revanth Reddy | హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అదే రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ కార్యవర్గ కూర్పు తదితర అంశాలపై పార్టీ అధిష్టానంతో రేవంత్ చర్చించే అవకాశం ఉంది.
కేబినెట్ విస్తరణకు సంబంధించి చాలా రోజులుగా ఏఐసీసీ కసరత్తు చేస్తున్నప్పటికీ, సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 16వ తేదీన మరోసారి సీఎం ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నాయకత్వంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే 27 మంది పేర్లతో ఓ జాబితా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.