హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): జనవరి 31న ఎల్బీ స్టేడియంలో వేల మంది సాక్షిగా.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్రెడ్డి.. త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి.. కొత్త పోస్టులు భర్తీ చేస్తామని చేసిన ప్రకటన ఉత్త ముచ్చటేనని తెలుస్తున్నది. ఇటీవల సీఎం రేవంత్ మరోసారి 15వేల కొత్త పోలీసుల ఉద్యోగాల గురించి ప్రకటించారు. దీంతో 46 జీవోతో అన్యాయానికి గురైన కానిస్టేబుల్ అభ్యర్థులు.. గత నోటిఫికేషన్లో చివరి వరకూ అర్హత సాధించలేని నిరుద్యోగులు ఒక్కసారిగా ఆశలు పెంచుకున్నారు. అయితే, తమ నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. సీఎం రేవంత్రెడ్డి బుధవారం చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 13,444 మందికి ఇటీవల ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తూ.. త్వరలో మరో రెండున్నర వేల మందికి నియామక పత్రాలు అందించడం ద్వారా 15వేల పోలీసు ఉద్యోగాలు పూర్తవుతాయని సీఎం ప్రకటించడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాల విడుదలలో జాప్యం జరిగితే.. వాటిని కూడా సీఎం రేవంత్రెడ్డి కోర్టు కేసులకు ముడిపెట్టి సభల్లో పచ్చి అబద్ధాలు వల్లవేస్తున్నారు. ఇప్పటివరకు సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన నర్సింగ్ ఆఫీసర్స్, గురుకుల, సింగరేణి ఉద్యోగ నియామకపత్రాలకు ఎట్లాంటి కోర్టు చిక్కులు లేవు. ఉన్నదల్లా ఒక్క కానిస్టేబుల్ నియామకాల్లోనే. అది కూడా గత అక్టోబర్లో విడుదల చేసిన ఫలితాలపైనే. కొందరు అభ్యర్థుల అభ్యంతరాల మేరకు హైకోర్టు నిపుణుల కమిటీ వేయగా.. ఆ కమిటీ సైతం కేసీఆర్ హయాంలో విడుదల చేసిన ఫలితాలకే మొగ్గు చూపింది. అయితే, అప్పటికే బోర్డు అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇందులో సీఎం రేవంత్రెడ్డి.. ఒక్కో చిక్కుముడి ఎక్కడ విప్పారు? అనేది కానిస్టేబుల్ ఉద్యోగార్థులను వేధిస్తున్న ప్రశ్న. విడుదలైన ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు ఇవ్వడం మాత్రమే ఆయన చేశారని అంటున్నారు. ఇకనైనా పోలీసు ఉద్యోగార్థులకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అంటున్నారే తప్ప.. కొత్త నోటిఫికేషన్ వేస్తానని మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు అంటున్నారు. నియామక పత్రాల సభల్లో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని నిరుద్యోగులను కోరుతున్న సీఎం.. కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో మాత్రం చెప్పడం లేదని నిరుద్యోగులు నిరుత్సాహపడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 16వేల కానిస్టేబుల్ ఉద్యోగాలే ఫైనలా? లేక 15వేల పోలీసు ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ ఏమైనా ఇస్తున్నారా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలని పోలీసు ఉద్యోగార్థులు కోరుతున్నారు. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. 16వ తేదీ వచ్చినా అతీ గతీ లేదని బాధపడుతున్నారు.