హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ‘ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్ట్‌పై ఎవరూ మాట్లాడొద్దు. అంతా గప్‌చుప్‌గా ఉండండి’ అంటూ మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది. నేతలందరికీ స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ఎన్టీవీ కథనం, జర్నలిస్టుల అరెస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతున్నా.. ఒక్క మంత్రి, ఒక్క నేత కూడా నోరు విప్పకపోవడం గమనార్హం. సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం ఇప్పటి వరకు స్పందించలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఒక్కరే మాట్లాడారు. ఆ తర్వాత జగ్గారెడ్డికి రేవంత్ ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. ఎందుకు స్పందించారని ప్రశ్నించినట్టుగా సమాచారం. ఏం జరిగినా కూడా ఎవరూ స్పందించొద్దని స్పష్టమైన సంకేతాలు జారీ చేసినట్టు తెలిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టివిక్రమార్కతో మాట్లాడేందుకు పలువురు జర్నలిస్టులతోపాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ప్రయత్నించినా స్పందన లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము స్పందించలేమని, ఏమీ చేయలేమని తేల్చి చెప్పినట్టుగా తెలిసింది.