హైదరాబాద్: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సురవరం అని చెప్పారు. విద్యార్థి దశ నుంచి జాతీయస్థాయి నేతగా ఎదిగారని వెల్లడించారు.
పాలమూరు జిల్లా బిడ్డా జాతీయ స్థాయి నేతగా గర్వకారణమని తెలిపారు. పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిన గొప్పనేతల్లో సురవరం ఒకరన్నారు. అధికారం ఉన్నా లేకున్నా తన సిద్ధాంతాలను ఎప్పుడూ వీడలేదన్నారు. సురవరం కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆయన జ్ఞాపకార్థం ప్రభుత్వం ఏదైనా మంచి కార్యక్రమం చేపడుతుందని, దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రభుత్వం గొప్ప నేతల పేర్లను పలు సంస్థలకు పెట్టిందని, అదే తరహాలో సుధాకర్ రెడ్డి సేవలను అందరూ స్మరించుకునేలా చేస్తామన్నారు.