హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తె లంగాణ): రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 15 న జపాన్ వెళ్లనున్న సీఎం.. ఐదు రోజు ల పాటు అక్కడే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు.
సచివాలయంలో మళ్లీ నకిలీలు!
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో నకిలీ ఉద్యోగుల సమస్య ఉన్నతాధికారులకు కనుకులేకుండా చేస్తున్నది. శనివారం సచివాలయ భద్రతా సిబ్బంది వైఫల్యం బహిర్గతమైంది. మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం జరుగుతుండగా ఇద్దరు నకిలీ ఉద్యోగులు లోపలికి వెళ్లినట్టు తెలిసింది. వారు ఆరో ఫ్లోర్‌కు వెళ్లేందుకు తచ్చాడుతుండగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్టు సమాచారం. వారిద్దరిని పరిశీలించగా, ఫేక్ ఐడీకార్డులతో సెక్రటేరియట్‌లోకి ప్రవేశించారని గుర్తించారు. విషయం బయటికి పొక్కకుండా పోలీసు సిబ్బంది, సచివాలయ సెక్యూరిటీ విభాగం దాచిపెట్టినట్టు తెలిసింది. సచివాలయ సెక్యూరిటీ సిబ్బంది వైఫల్యం వల్లే తరచూ సచివాలయంలో నకిలీ ఉద్యోగులు ప్రవేశిస్తున్నారు. నిరుడు కూడా పలువురు ఫేక్ ఐడీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.