హైదరాబాద్, నవంబర్ 24(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే ఓ ఫంక్షన్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం కాం గ్రెస్ అధిష్ఠానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణపైనా ఆయన చర్చించనున్నారని సమాచారం. ఆయా అంశాలపై నెల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ర్టానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 27వసారి కావడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతినెల సగటున రెండుసార్లు ఢిల్లీ బాటపడుతున్నారు.