Revanth Reddy | సంగారెడ్డి మే 23 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీని ఒక్కసారి కాదు యాభైసార్లు అయినా కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రూ.400 కోట్లకుపైగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. నిమ్జ్ భూసేకరణ, పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామని వెల్లడించారు. నిమ్జ్‌లో 450 ఎకరాల్లో త్వరలోనే హ్యుందయ్ కం పెనీ ఏర్పాటవుతుందని తెలిపారు. నిమ్జ్‌లో భూములు కోల్పోయిన 5,612 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఇది మినహా జిల్లాకు మరే నిర్దిష్ట హామీ ఇవ్వలేదు. అంతకుముందు ప్రసంగించిన జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్ షెట్కార్ పలు విజ్ఞప్తులు చేసినప్పటికీ, ఆయా పనులకు సీఎం నిధులు ప్రకటించకపోవడంతో వారు అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తున్నది.
సీఎం సభకు హాజరైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అలకబూనారు. సభలో ప్రసంగించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సభాధ్యక్షుడు, ఎంపీ సురేశ్ షెట్కార్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డిని కోరినప్పటికీ తిరస్కరణ ఎదురైంది. దీంతో ఆయన చేసేదేమీ లేక తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రాలను సీఎంకు అందజేసి సభ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇది గమనించిన మరో ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆయనను వారించారు. ఇదిలా ఉంటే నిమ్జ్ భూనిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసే బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి అప్పగిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తనను కాదని జగ్గారెడ్డికి ఈ బాధ్యత అప్పగించడంపై మాజీ మంత్రి చంద్రశేఖర్ అలకబూనినట్టు తెలుస్తున్నది.
జహీరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభ జనం లేక వెలవెలబోయింది. బహిరంగ సభకు 30వేల మందిని సమీకరించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకోగా, సుమారు 10 వేల మంది మాత్రమే హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సీఎం ప్రసంగిస్తుండగానే బహిరంగసభ నుంచి ప్రజలు ఇండ్లకు తిరుగుమఖం పట్టడం కనిపించింది.
సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు శుక్రవారం వేకువజాము నుంచే రైతులు, బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను ఇండ్ల నుంచి కదలకుండా నిర్బంధించారు. నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులు సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా ఆందోళనలకు దిగుతారన్న భయంతో న్యాల్కల్ మండలం మామిడ్గి, ఝరాసంగం మండలంలోని ఎల్గోయికి చెందిన రైతులతోపాటు న్యాల్కల్ మండలం మల్గి, డప్పూరు, న్యామతాబాద్, ఝరాసంగం, జహీరాబాద్‌కు చెందిన యాభై మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి చిరాగ్పల్లి, హద్నూర పోలీసుస్టేషన్లకు తరలించారు. మరికొంత మంది ముఖ్య నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు. సీఎం పర్యటన ముగిసిన అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ అరెస్టులను నిరసిస్తూ మామిడ్గిలో మహిళలు, గ్రామస్థులు ఆందోళనకు దిగగా, వారిని కూడా అరెస్టుచేసి హద్నూర పోలీస్టేషన్‌కు తరలించారు.