రవీంద్రభారతి, మార్చి2: ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ఉండాలని, దానికోసం త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల ఏర్పాటుపై పర్యాటకశాఖ మంత్రి నేతృత్వంలో త్వరలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు ఆశీస్సులతో తాను విద్యార్థి నేతగా ఎదిగానని చెప్పారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం జరుపుతున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, శాసనసభ స్పీకర్ గడ్డంప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా శనివారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, శంకరయ్య, అనిరుధ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, నాగరాజు, శ్రీహరి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు.