CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, కథనాలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులను తరుచూ టార్గెట్ చేస్తూ, ఏదో ఒకరకంగా ఉక్రోషం వెళ్లగక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మెట్టుదిగి చెంప పగలగొట్టాలని అనిపిస్తున్నదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జరిగిన ఒక పత్రిక పదో వార్షికోత్సవసభలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు జర్నలిస్టులు అన్న పదానికి అర్థం వెతుక్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. జర్నలిజం ముసుగులో ఎవడెవడో వస్తున్నాడని, పొట్టకోస్తే అక్షరం ముక్క కూడా రానివాళ్లు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు. తాము పత్రికా సమావేశాలు పెడితే ఎవడు పడితేవాడు వస్తున్నాడని, ఖాళీగా ఉంటున్నవాళ్లు మూడు గంటల ముందే వచ్చి మొదటి వరుసలో కూర్చుంటున్నారని, సీనియర్లు వచ్చినా కనీసం మర్యాద ఇవ్వడం లేదన్నారు.
వాళ్లు కూర్చునే తీరు కూడా ధిక్కార స్వభావంతో ఉంటున్నారని, నమస్తే పెట్టరా? అన్నట్టుగా చూస్తున్నారని, అలాంటివారిని చూసినప్పుడు స్టేజీ దిగి చెంప పగులగొట్టాలనిపిస్తుందని చెప్పారు. కొందరు తాతముత్తాల నుంచి వాళ్ల ఇంటి పేరు జర్నలిస్టు అయినట్టుగా జర్నలిస్టు ఎల్లయ్య, జర్నలిస్టు పుల్లయ్య అని కూడా పెట్టుకుంటున్నారని, వాళ్లు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లో చదువుకున్నారా? సమాజాన్ని అధ్యయనం చేశారా? అని సీఎం ప్రశ్నించారు. అక్షరం ముక్కరాని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పేర్లతో ఎవడు పడితేవాడు వస్తున్నాడని, నిజమైన జర్నలిస్టులు ఒకవైపు, ముసుగు జర్నలిస్టులు ఒకవైపు ఉండాలని సూచించారు. ఆపరేషన్ సింధూర్లో యూట్యూబ్ జర్నలిస్టులు కొందరు పాకిస్తాన్ ఏజెంట్లుగా కూడా ఉన్నట్టు బయటపడిందని గుర్తుచేశారు. రోడ్లపై అవారాగా తిరిగేవాళ్లు, తిట్లు వచ్చినవాళ్లు, ఏది పడితే అది మాట్లాడేవారు జర్నలిస్టు అనే ముసుగేసుకొని సోషల్మీడియాలో అందరిపై అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు. రాజకీయ నేతలుగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని కొందరు అంటున్నారని, తమపై మాట్లాడేవారికి సమాధానంగా తప్పని పరిస్థితుల్లో తాము కూడా మాట్లాడాల్సి వస్తున్నదని, వేరే మార్గం కనిపించడంలేదని చెప్పారు.
కమ్యూనిస్టు పార్టీల అండ ఉంటే అధికారంలోకి వస్తారని సీఎం ప్రశంసించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టు పార్టీల సహకారం మరువలేనిదని అన్నారు. విద్యుత్తు ఉద్యమం, పాదయాత్రలు వంటివాటిని కమ్యూనిస్టులే చేశారని, అధికారపార్టీని దింపగలిగారని చెప్పారు. 2023లో కూడా కమ్యూనిస్టు పార్టీలు చేసిన ఉద్యమాలు కాంగ్రెస్కు పరోక్షంగా ఉపయోగపడ్డాయని తెలిపారు. ఎంతటి నలభీములు చేసే పాకమైనా ఉప్పు తక్కువైతే రుచి రాదని, రాజకీయాల్లో కూడా కమ్యూనిస్టులు లేకపోతే అధికారంలోకి రాలేమని స్పష్టంచేశారు. అధికారంలో ఉన్నవారిని దించివేసేందుకు కమ్యూనిస్టులు నూటికి నూరు శాతం ఉపయోగపడ్తారని పేర్కొన్నారు.
ఇదే సభలో సీఎం రేవంత్రెడ్డి మరో షాకింగ్ కామెంట్ చేశారు. ఎవరినైనా సరే బాగా నమ్మిస్తేనే మోసం చేయగలమని, అలాగే, నమ్మకం లేకపోతే మోసం చేయడం కూడా ఉండదని, నమ్మకానికి మోసం అన్నది నీడలా ఉంటుందన్నారు. నమ్మకం కలిగించడానికి ఎవరైనా ఎక్కువగా ప్రయత్నిస్తే అలాంటివారి పట్ల ఒకటికి రెండుసార్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీఎం ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది.