Auto Union | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఊపిరాడనివ్వకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు డీజిల్ ఆటోలను నగరం వెలుపలికి తరలించాలని ప్రతిపాదించడంపై ఆటోడ్రైవర్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోయి, కుటుంబాన్ని పోషించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 52 మందికి పైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరో షాక్ ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జరిగిన విజయోత్సవాలలో మాట్లాడుతూ.. డీజిల్ ఆటోలన్నింటినీ ఔటర్ రింగ్‌రోడ్డు అవతలికి తరలించాలని, వాళ్లందరూ ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేస్తే ఎటువంటి రాయితీలు ఇవ్వగలమో పరిశీలించాలని రవాణా మంత్రికి సూచించారు.
నగరంలో తిరగుతున్న డీజిల్ ఆధారిత ఆటోలన్నింటినీ నగరం బయటకు పంపించడం ద్వారా నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఆటోడ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుండగా.. డీజిల్ ఆటోలను నగరం వెలుపలికి తరలించాలని ఆదేశించడం ఏమిటని వాపోతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చొన్నట్టు.. ఆటోడ్రైవర్ల బతకులు ఆగమైతుంటే ముఖ్యమంత్రిలో మాత్రం చలనం లేదని మండిపడుతున్నారు. ఆటో డ్రైవర్లు అంటే ముఖ్యమంత్రికి ఎందుకంత పగ అని ప్రశ్నిస్తున్నారు. నగరాన్ని కాలుష్యరహితం చేయాలంటే.. కాలుష్య కారక కంపెనీలు, ఫార్మా ఇండస్ట్రీలపై చర్యలు తీసుకోవాలని.. కానీ ఆ దమ్ము సీఎంకు లేదని విమర్శించారు. నగరంలో 1.30లక్షల మంది ఆటో డ్రైవర్లను బలిపశువులు చేసిన పాపం సీఎం రేవంత్‌రెడ్డిదేనని పేర్కొన్నారు.
వైరల్‌గా ఆటోవాలాల సూసైడ్ రిపోర్ట్..!
రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటోడ్రైవర్ల వివరాలతో ‘ఆటోడ్రైవర్ల సూసైడ్ రిపోర్ట్’ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు స్కీం ప్రవేశపెట్టినప్పటి నుంచి 50 మందికి పైగా ఆటోడ్రైవర్లు చనిపోయారంటూ వారి పేర్లను షేర్ చేశారు. ఆ లిస్ట్‌కు పేపర్ క్లిప్పింగ్స్, టీవీ చానెళ్ల వీడియోలు జతచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారి చావులపై హేళనగా మాట్లాడుతున్నదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మృతుల ఫొటోలను షేర్ చేస్తూ వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆటోడ్రైవర్లు చనిపోతే వర్తించే ప్రమాద బీమా రూ.5 లక్షలు పథకం సైతం రెన్యువల్ చేయని కాంగ్రెస్ సర్కార్ అంటూ డ్రైవర్ల జేఏసీ విమర్శించింది.
ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వగలరా?
ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే ఉచిత బస్సు స్కీంతో ఆటో డ్రైవర్ల బతుకు రోడ్డున పడింది. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం వారి సమస్యలు వినడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యను పరిష్కరించకుండానే డీజిల్ ఆటోలను ఔటర్ దాటిస్తామనడం దారుణం. దమ్ముంటే ఎలక్ట్రిక్ ఆటోలను డ్రైవర్లకు ఉచితంగా ఇవ్వాలి. సమస్యలపై మాట్లాడకుండా ఆటో డ్రైవర్ల ఉద్యమాన్ని రాజకీయంగా చూస్తుండటం సహేతుకం కాదు. డీజిల్ ఆటో డ్రైవర్లందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం.
-వేముల మారయ్య, అధ్యక్షుడు, బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్.
ఇప్పటికే బతకలేక చస్తున్నాం
సీఎం వ్యాఖ్యలు బాధాకరం. ఆటో డ్రైవర్లంటే ఆయనకు ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు. మేం గరీబోళ్లం. ఇప్పటికే ఉచితబస్సుతో నష్టపోతున్నాం. ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ఇవ్వడం లేదు. కొంతమంది డ్రైవర్లు అప్పులు, ఈఎంఐలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం మాకు సాయం అందిస్తుందని ఎదురుచూస్తుంటే.. మరింత నరక కూపంలోకి నెట్టేసేఈ డీజిల్ ఆటోలను తరలిస్తామని సీఎం చెప్పడం సిగ్గుచేటు. ఇలాంటి సర్కార్‌ను ఎక్కడా చూడలేదు.
-రామాంజనేయులు, ఆటో డ్రైవర్.
సంక్షేమ బోర్డు ఏమాయె?
ఆటో డ్రైవర్లందరం సాయం కోసం ఎదురుచూస్తుంటే దానిపై అది మాట్లాడకుండా సీఎం మాపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇది విడ్డూరంగా ఉంది. ఆటో డ్రైవర్లు చస్తుంటే సీఎం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఆటోడ్రైవర్ల ఓట్లతోనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైందనే విషయాన్ని సీఎం గుర్తు పెట్టుకోవాలి. డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాటిచ్చి దానిని మరిచిపోయారు. కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.
-శ్రీనివాస్, ఆటో డ్రైవర్.