CM Revanth reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): పదేండ్లు తానే ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారని, ఎలా వస్తారో చూస్తానని సవాల్ విసిరారు. కేసీఆర్ సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్ల కారణంగా కానిస్టేబుల్ పోస్ట్‌లకు ఎంపికైన 13,444 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో వేసిన రిక్రూట్మెంట్లకు న్యాయపరమైన అడ్డంకులను పరిష్కరిస్తూ నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పారు. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ కుటుంబమని అన్నారు. ‘ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటా’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చికుముడులు విప్పి నియామకాలు పూర్తి చేశామని చెప్పారు. ఏ తప్పూ లేకుండా.. ఎవరికీ నష్టం జరగకుండా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల కోసం అర్హత వయసును 44 నుంచి 46 ఏండ్లకు పెంచామన్నారు. తెలంగాణను కబళించడానికి గంజాయి, డ్రగ్స్ ముఠాలు తిరుగుతున్నాయని, వాటిని కూకటివేళ్లతో పెకిలించాల్సిన బాధ్యత మీపై ఉందని పోలీస్ అధికారులకు సూచించారు. తెలంగాణ యువతను నిర్వీర్యం చేసే గంజాయి, డ్రగ్స్ ముఠాలు రాష్ట్రంలో ఉండకూడదన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హరర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.