హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : రెండు రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదకొండు అంశాలపై విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ప్రధానికి విన్నవించిన అంశాలు ఇలా ఉన్నాయి.
1. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలి. గత ప్రభుత్వం 1600 మెగావాట్లను మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి.
2. హైదరాబాద్ మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు సహకరించండి.
3. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి.
4. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 2022-23లోనే కేంద్రం డీపీఆర్ తయారీకి రూ. 3 కోట్లు మంజూరు చేసింది. రూ. 7700 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్‌తో శ్రీశైలం యాత్రికులతోపాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కి.మీ. దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణా మార్గాలు విస్తరిస్తాయి.
5. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. గ్రామాల్లో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు జల్‌జీవన్ మిషన్ ద్వారా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
6. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ క్యాడర్ పోస్టులను మంజూరు చేసింది. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలు, పోలీసు కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాలి.
7. హైదరాబాద్-రామగుండం, హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితోపాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీ సామర్థ్యంతో కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీఫాం ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ర్టానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్‌పేట ఫీల్డ్ ఫైరింగ్రేంజ్ (1038 ఎకరాలు) భూములను తిరిగి అప్పగించాలి.
8. ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు ఉన్న హైదరాబాద్‌లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.
9. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం వాటాగా రాష్ర్టానికి రావాల్సిన రూ. 347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
10. భారత్‌మాల పరియోజన జాతీయ రహదాలు అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి-కొల్లాపూర్, గౌరెల్లి-వలిగొండ, తొర్రూర్-నెహ్రూనగర్, నెహ్రూనగర్-కొత్తగూడెం, జగిత్యాల-కరీంనగర్ ఫోర్‌లేన్, జడ్చర్ల-మరికల్ ఫోర్‌లేన్, మరికల్-డియసాగర్ టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.
11. సెమీ కండక్టర్లు, డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండక్టర్ల మిషన్‌లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం.