CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): సర్కారు ఆదాయం తగ్గుతున్నది.. ఖర్చులు పెరుగుతున్నయ్.. పథకాలు నడిపే పరిస్థితి కానరావడం లేదు.. ఈ దశలో ధరలు పెంచుడు.. పైసలు పిండుడు ఎలా? ప్రణాళికలు సిద్ధం చేయండి.. అని సీఎం రేవంత్‌రెడ్డి అధికాదాయాన్ని ఇచ్చే శాఖల అధిపతులకు ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయా శాఖల హెచ్‌వోడీలతో గురువారం ప్రత్యేకంగా సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సీఎస్ సహా ఇతర అధికారులెవరూ లేకుండానే ఒంటరిగా ఒక్కో హెచ్‌వోడీతో అర గంటకుపైగా మాట్లాడినట్టు తెలిసింది.
అంచనాల కన్నా ఆదాయం తక్కువగా వస్తున్నదని, సంక్షేమ పథకాలు కూడా నడిపే పరిస్థితి లేదని, ఇలాగే కొనసాగితే ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఎలాగైనా రాబడిని పెంచాల్సిందేనని, ఏ విధంగా పెంచవచ్చో ప్రతిఒక్కరూ ఒకటి రెండు రోజుల్లో ప్రణాళికలు సమర్పించాలని స్పష్టంచేసినట్టు సమాచారం. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా వేటి ధరలు పెంచవచ్చో చెప్పాలని సీఎం ఆదేశించారట. రాష్ట్రం నడవాలంటే నెలకు సుమారు రూ.10 వేల కోట్ల నుంచి 12 వేల కోట్లు అవసరమని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి, సబ్సిడీ సిలిండర్లు వంటి పథకాల భారం పెరిగిందని, మరోవైపు ఆదాయం పడిపోయిందని ఆ వర్గాలే చెప్తున్నాయి.
తగ్గిన ఆరు శాతం రాబడి
నిరుడితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఉన్నతాధికారులు సీఎంకు లెక్కలతో సహా వివరించారు. కాగ్‌కు ప్రభుత్వం సమర్పించిన సెప్టెంబర్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.75,454 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. రాబడి అంచనాలో ఇది 34 శాతం మాత్రమే. ఇదే సమయానికి నిరుడు రూ.87,207 కోట్లు ఖజానాకు చేరాయి. అంటే ఈ ఏడాది రూ.11,753 కోట్లు రాబడి తగ్గిందని ఆర్థికశాఖ వర్గాలు వివరించినట్టు సమాచారం.
పథకాల అమలుకు పరేషాన్
మరోవైపు గృహజ్యోతి పథకానికి లబ్ధిదారుల సంఖ్య, ఆర్టీసీలో మహిళల ప్రయాణ రాయితీలు పెరుగుతున్నాయి. దసరా పండుగకు ఉచిత ప్రయాణం డబుల్ అయ్యింది. వీటికి తోడు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. వడ్లకు బోనస్ ఇచ్చే గడువు తరుముకొస్తున్నది. రుణమాఫీ ఇంకా పూర్తిచేయాల్సి ఉన్నది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యం కాదని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు తేల్చి చెప్పారని సచివాలయ వర్గాల సమాచారం. వీటికి తోడు అధికార పార్టీ హామీలన్నీ అమలు చేయాల్సి వస్తే నెలకు కనీసం రూ.8 వేల కోట్ల నుంచి 10 వేల కోట్లు అదనంగా కావాలని తేల్చి చెప్పారట. అప్పులు తెద్దామన్నా ఇప్పటికే చేసిన రుణాలతో ఎఫ్ఆర్బీఎం పరిమితి ముంచుకొస్తున్నదని, ఆశించిన మేర అప్పు పుట్టకపోవచ్చని చెప్పినట్టు తెలిసింది. గరిష్ఠంగా నెలకు నాలుగైదు వేల కోట్ల వరకు రావొచ్చని, అయినా కనీసం నెలకు నాలుగైదువేల కోట్లు లోటు ఉంటుందని వివరించారట. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రత్యేకంగా హెచ్‌వోడీలతో సమావేశం నిర్వహించారని చెప్తున్నారు.
ఆదాయం ఎందుకు రావడం లేదబ్బా!
ఒక్క ఎక్సైజ్ మినహా మిగతా విభాగాల నుంచి ఆశించిన ఆదాయం ఎందుకు రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఓ వైపు రాబడి పడిపోతున్నదని, మరోవైపు సంక్షేమ పథకాలకు ఖర్చు పెరుగుతున్నదని, దీనిని ఎలా అధిగమించాలో చెప్పాలని అధికారులనే సీఎం సలహాలు అడిగినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో రాబడి పెరగాల్సిందేనని స్పష్టం చేయడంతో, పన్నులు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆ హెచ్వోడీలు తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఏయే విభాగాల్లో పన్నులు పెంచవచ్చో ప్రతిపాదనలు రూపొందించాలని ఆ అధికారులను సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.