హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థులను ఓడించి రాజకీయంగా తనను బలహీన పరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి సోమవారం సొంత నియోజకవర్గం కొడంగల్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి పెద్ద గూడుపుఠాని జరుగుతున్నదని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శంఖారావాన్ని పూరిస్తూ జరిగిన బహిరంగ సభలో కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికి కుట్రలు జరుగుతున్నాయని పదే పదే సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దేనికి సంకేతం? అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ కుట్రలు కాంగ్రెస్‌లో జరుగుతున్నాయా? లేక బయట రాజకీయ ప్రత్యర్థులు పన్నుతున్నారా? అనేదానిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌లో ఏక్నాథ్ షిండేలు ఉన్నారని ఒకవైపు బీజేపీ, ఆ పాత్ర రేవంత్‌రెడ్డినే పోషిస్తారని మరో బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనను రాజకీయంగా బలహీన పరిచే కుట్రలు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి భయపడటం, తన సొంత పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు అభద్రతాభావానికి గురి చేస్తున్నాయా? అనే అనుమానాలు వస్తున్నాయి.
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య గ్యాప్!
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మధ్య అంతరం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. యాదగిరిగుట్ట ఘటన మొదలుకొని తాజాగా తుక్కుగూడ సభా వేదిక వద్ద ఆయన డ్రైవర్‌కు జరిగిన అవమానాన్ని భట్టి తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు నామినేటెడ్ పోస్టుల నియామకంలో తమను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని కొందరు మంత్రులు కినుక వహించారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక పట్ల కూడా పార్టీలో సీనియర్లు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో తనను బలహీన పరచడానికి పార్టీ నేతలు ఏమైనా వెనుకాల గోతులు తొవ్వుతున్నారా? అలాంటి సమాచారం ఏదైనా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వచ్చిందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత వల్ల కాంగ్రెస్‌కు ఓటమి భయం పట్టుకుందా? అదే జరిగితే రాజకీయంగా తాను బలహీనం అవుతానని సీఎం రేవంత్‌రెడ్డి ఏమైనా భయాందోళనకు గురవుతున్నారా? అనే చర్చ జరుగుతున్నది.