హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పాసైన విద్యార్థులంతా ఇంటర్మీడియట్లో ఎందుకు చేరడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ప్రశ్నించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్లో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువెందుకని ఆరా తీశారు. పదో తరగతి పాసైన వారంతా కచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. మధ్యాహ్న భోజనాన్ని గ్యాస్, కట్టెల పొయ్యిల మీద వండే బాధల నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని ఆదేశించారు. సర్కారు బడుల్లో సోలార్ కిచెన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ ఏడాది 48వేల మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడుల్లో చేరినట్టు అధికారులు వివరించారు.
అనుమతుల్లేకుండానే తరగతుల నిర్వహణ ; గుర్తింపు లేని ఇంటర్ కాలేజీలు 250 l 18 కాలేజీలకు నోటీసులు
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 250 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇంటర్‌బోర్డు గుర్తింపు పొందకుండా క్లాసులు నిర్వహిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు నడుస్తుండటంతో ఇంటర్‌బోర్డు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నది. ప్రత్యేకంగా మూడు బృందాలను నియమించి తనిఖీలు నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 18 కాలేజీల్లో క్లాసులు జరుగుతున్నట్టుగా అధికారులు తేల్చారు. ఆయా కాలేజీలకు నోటీసులు జారీచేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు కోసం 3,064 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు 2,780 కాలేజీలకు గుర్తింపు జారీచేసింది. 284 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. వీటిలో గవర్నమెంట్ సెక్టార్ కాలేజీలు మినహా 250 ప్రైవేట్ కాలేజీలు గుర్తింపు లేకుండా నడుస్తున్నట్టు గుర్తించారు. వీటిలో కొన్ని మిక్స్డ్ ఆక్యుపెన్సీ(కాలేజీ భవనంలో వ్యాపార, వాణిజ్య సంస్థలున్నవి) కాలేజీలున్నాయి. ఈ కాలేజీలు ఫైర్ ఎన్వోసీని సమర్పించకపోవడంతో ఇంటర్‌బోర్డు గుర్తింపు ఇవ్వలేదు.