హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ,రాజకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సర్వే తీరుపై అధికారులతో సమీక్షించారు. సర్వేను జాప్యం లేకుండా నిర్దేశించిన సమయంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. తొలిదశలో నివాసాల లిస్టింగ్‌లో మొత్తం 1,16,14,349 ఇండ్ల్లకు మారింగ్ చేశారని, వీటిలో ఏ ఒక ఇల్లును వదలకుండా సర్వే నిర్వహించాలని సూచించారు.
ఈ సర్వే రాష్ట్ర పౌరుల అభ్యున్నతికే జరుగుతున్నదని చెప్పారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం అంటే 5,24,542 ఇండ్లలో సర్వే పూర్తయిందని, ఈ సర్వేలో 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు పాల్గొంటున్నారని, ప్రజల నుంచి స్పందన బాగుందని అధికారులు సీఎంకు వివరించారు.
52,493 గ్రామీణ, 40,901 అర్బన్ బ్లాకులుగా మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి సర్వే జరుగుతున్నదని చెప్పారు. సర్వే ప్రక్రియ పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారులను ఉమ్మడి జిల్లాలవారీగా నియమించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, ప్రణాళికాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.