హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ):నూతనంగా ఏర్పాటుచేయనున్న స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కాలేజీలను తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రారంభించాలని నిర్దేశించారు. సిలబస్ రూపకల్పనకు నిపుణల కమిటీని నియమించి విద్యావేత్తల సలహాలు స్వీకరించాలని సూచించారు. శనివారం సచివాలయంలో కార్మిక, ఉపాధి కల్పనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఐటీఐ కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఉండేలా చర్యలు తీసుకొని, సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏటీసీలను ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఐటీఐ,ఏటీసీలులేని నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ మినహా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలని కోరారు.