CM Revanth Reddy | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు సీఎం రేవంత్‌రెడ్డిపై దాఖలు చేసిన పరువు నష్టం క్రిమినల్ కేసు విచారణను గురువారం ప్రజాప్రతినిధుల కోర్టు చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన తరఫున గైర్హాజరు పిటిషన్‌ను కోర్టుకు సమర్పించడంతో కోర్టు అంగీకరించి వచ్చేనెల 5కు విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ పార్టీ అధికారం చేపడితే రిజర్వేషన్లను పట్టించుకోదని రేవంత్ చేసిన వాఖ్యల పట్ల తమ పార్టీ పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదముందని ఫిర్యాదుదారుడు కాసం కోర్టులో పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు సీఎం కోర్టుకు హాజరుకాలేదు. ఫిర్యాదుదారుడి వాంగ్మూలంతోపాటు సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ప్రముఖ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగ్‌లను సాక్ష్యాధారాలుగా కోర్టుకు సమర్పించారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ చేసిన ప్రసంగం పట్ల బీజెపీ పార్టీ సీరియస్‌గా పరిగణించి కోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదుదారుడి సాక్ష్యంతోపాటు సాక్షుల సాక్షాధారాల్ని పరిశీలించిన పిదప కోర్టు కేసు విచారణ కొనసాగిస్తుంది. నిందితుడు రేవంత్ తరఫున న్యాయవాది నేరం చేయలేదని రుజువుచేయాల్సి ఉంటుంది.