Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తీరా అక్కడికి వెళ్లాక అప్పుల వేట మొదలుపెట్టారు. తెలంగాణ రైజింగ్‌కు రూ.11,693 కోట్ల రుణం కావాలని జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రతినిధులను కోరారు. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం గురువారం జైకా ప్రతినిధులతో సమావేశమైంది. సీఎంతోపాటు పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా, ఆ సంస్థ సీనియర్ మేనేజర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ నిర్మించనున్న రేడియల్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరాను కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.24,269 కోట్ల అంచనాలతో చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రం తుది పరిశీలనలో ఉన్నాయని సీఎం వారికి వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమమ్యే వ్యయంలో 48% అంటే రూ.11,693 కోట్లను రుణంగా ఇవ్వాలని కోరారు. భారత ప్రభుత్వ విదేశీ రుణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. మెట్రోరైలుతోపాటు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు, ఫ్యూచర్ సిటీకి, కొత్త రేడియల్ రోడ్లకు కూడా నిధులు సమకూర్చాలని కోరారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని సీఎం వారికి వివరించారు.
ముఖ్యమంత్రి విజ్ఞప్తికి షోహెయ్ హరా స్పందిస్తూ.. మెట్రో రైలు విస్తరణతోపాటు అర్హతలు ఉన్న ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు జైకా నుంచి ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. జైకాకు తెలంగాణతో ఎన్నో ఏండ్లుగా సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి వీ శేషాద్రి, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, తెలంగాణకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి న తరువాత 15 నెలల్లోనే రూ.1,53,359 కోట్లు అప్పులు చేసింది. ఇటీవల కంచ గచ్చిబౌలిలోని భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల రుణం పొందింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమైంది. రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి వందల ఎకరాల్లోని వృక్షాలను ధ్వంసం చేసింది. అయితే, హెచ్‌సీయూ విద్యార్థుల ఆందోళనలు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మామిడిపల్లిలోని 450 ఎకరాలను అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదనే వార్తలొచ్చాయి.
మరోవైపు, ముఖ్యమంత్రి జపాన్ పర్యటన సందర్భంగానూ అప్పుల కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. స్వల్పకాలంలోనే భారీగా అప్పులు చేసిన రేవంత్ సర్కారు.. కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా కట్టకపోగా, రన్నింగ్ ప్రాజెక్టులను సైతం ఎండబెడుతున్నదనే విమర్శలను ఎదుర్కొంటున్నది. కనీసం రైతు భరోసా నిధులు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నదన్న అసంతృప్తి రైతుల్లో వ్యక్తమవుతున్నది.