CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్‌షాను ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సోమవారం కలుసుకున్నారు. వీరిద్దరూ సుమారు అరగంట పాటు ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది. కేంద్ర హోంశాఖ ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి.. సమావేశం ముగిసిన వెంటనే మూడున్నర గంటలకు కృష్ణమీనన్ మార్గ్‌లోని అమిత్‌షా ఇంటికి వెళ్లారు.
రేవంత్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ, ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా అమిత్‌షా నివాసానికి వెళ్లారు.అయితే, వీరిద్దరు ఆ భేటీలో లేరు. అమిత్‌షా, రేవంత్‌రెడ్డిల మధ్య సుధీర్ఘంగా అనేక అంశాలపై చర్చ జరిగినట్టు ఢిల్లీలోని మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఈ భేటీపై అటు అమిత్‌షా కార్యాలయంకానీ, ఇటు సీఎం కార్యాలయం కానీ ఎటువంటి స్పష్టతనివ్వలేదు.
ఏకాంతంగా ఎందుకు భేటీ అయ్యారన్న ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పడంలేదు. రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సమావేశంలోనే ఆయనతో మాట్లాడే అవకాశం ఉన్నది. కొన్ని రాష్ట్రాల హోంశాఖ మంత్రులు, అమిత్‌షాను కలిసి తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను చర్చించారు. అధికారులు కూడా అక్కడే అందుబాటులో ఉండడంతో అమిత్‌షా అడిగిన ప్రశ్నలకు కూడా సులువుగా సమాధానం ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి అమిత్‌షాను వెళ్లి కలువడం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా అమిత్‌షాను కలిశారు. రేవంత్‌రెడ్డి కలువడానికి కొద్దిసేపు ముందే వీరి భేటీ జరగడం గమనార్హం. అయితే, తాను అమిత్‌షాను మర్యాదపూర్వకంగా కలిశానని, ఏలాంటి రాజకీయపరమైన చర్చ జరగలేదని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల భేటీ
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అధికారులు, మంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా విజ్ఞాన్‌భవన్‌లో ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిత్యానంద రాయ్, జువల్ ఓరం, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్, ఒడిశా సీఎం చరణ్మాంఝీ, ఏపీ హోంశాఖ మంత్రి అనిత, బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన అధికారులు, మంత్రులు హాజరయ్యారు.
తెలంగాణ నుంచి సీఎంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, ఎస్ఐబీ డీఐజీ బడుగుల సుమతి తదితరులు కూడా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రాష్ట్రాలు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా అమిత్‌షా చెప్పారు. 2026 నాటికి దేశంలో మావోయిస్టులను రూపుమాపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. నిఘా వ్యవస్థను పటిష్ఠ పరచుకోవాలని, రాష్ట్రాలకు ఈమేరకు అవసరమైన సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.