Telangana |రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందు ఉన్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృథా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు నూటికి నూరుపాళ్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లేనిపోని గొప్పలు, ఆర్బాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ రూపొందించాలని సూచించారు.
అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. తప్పనిసరి అయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాలు కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.