Revanth Reddy | కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేములవాడ రాజన్న సాక్షిగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అనేక అసత్యాలు మాట్లాడి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. కండ్లెదుట కనిపించే నిజాలను, బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులను జీరోగా చూపించే ప్రయత్నం చేయబోయి ఆయనే బొక్కబోర్లా పడ్డారు. అసలు ముఖ్యమంత్రి ఏ ప్రాంత పర్యటనకు వస్తారో.. ఆ ప్రాంతానికి సంబంధించిన హామీలు ఇస్తారు. కానీ, వేములవాడనో.. జిల్లా కేంద్రమైన సిరిసిల్లనో కాకుండా ఈ ప్రాంతానికి సంబంధమే లేని ఎక్కడో ఉన్న కొడంగల్ గురించి ఎక్కువసేపు ప్రసంగించిన తీరు సభికులను విస్మయానికి గురిచేసింది. వేమువాడలో జరిగిన సభలో సీఎం చేసిన ఆరోపణలు-వాస్తవాలు ఇవీ..
రేవంత్ ఆరోపణ : పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్‌రావు రాజన్న అలయ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 100 కోట్లు కేటాయించేందుకు కూడా నిధుల్లేవా? ఇది వివక్ష కాదా?
నిజం ఇదీ : ఒక క్రమ పద్ధతిలో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
విస్తరణ కోసం ఉన్న స్థలం సరిపోదని భావించి కేసీఆర్ ఆదేశాల మేరకు రూ.30 కోట్లతో 32 ఎకరాల స్థలాన్ని సేకరించింది. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో కూడా కేసీఆర్ సేకరించిన స్థలంలోనే జరిగింది. ఈ విషయాన్ని రేవంత్ కూడా గుర్తించలేదు. రూ.70 కోట్లతో గుడిచెరువు బండ్ నిర్మాణం, రూ.10 కోట్లతో గుడి చెరువు సుందరీకరణ పనులను బీఆర్ఎస్ ప్రభుత్వమే చేపట్టింది. దేవాలయ అభివృద్ధి కోసం వేములవాడ ఏరియా అభివృద్ధి కమిటీ (వీటీడీఏ)ని ఏర్పాటు చేసింది. రూ.5 కోట్లతో మిషన్ భగీరథ పథకం కింద ప్రత్యేక లైన్ వేసి ఆలయంలో శాశ్వతంగా మంచినీటి కొరతను తీర్చింది. రూ.17.5 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు 39.5 గుంటల స్థలం సేకరించింది. రూ.10 కోట్లతో బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు శంకుస్థాపన చేసింది. ఇవేవీ చేయనట్టుగానే రేవంత్‌రెడ్డి నమ్మించే ప్రయత్నం చేశారు.
ఆరోపణ : కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 9ని సిరిసిల్లలో ఎందుకు పడావు పెట్టారు. సిరిసిల్లకు ఎందుకు ప్రయోజనం చేకూర్చలేదో ప్రజలు ఆలోచించాలి.
నిజం ఇదీ : నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు-9 కింద బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పనులు జరిగాయి. ఈ ప్యాకేజీ కింద నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014 వరకు కేవలం రూ.40.74 కోట్లే ఖర్చు పెడితే రూ.900 కోట్లకు పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ప్యాకేజీ కింద సొరంగాలను దాదాపుగా పూర్తి చేసింది. రూ.472 కోట్లతో చేపట్టిన మల్కపేట జలాశయాన్ని పూర్తిచేసి, ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ ప్యాకేజీ కింద దాదాపు 70 వేల ఎకరాల అదనపు ఆయకట్టకు ప్రతిపాదనలు చేసింది. పనులు కూడా కొనసాగుతున్నాయి. ఈ ప్యాకేజీ కింద నామమాత్రంగా మిగిలిన పనులు పూర్తిచేస్తే వేములవాడ నియోజకవర్గంలో 31,680 ఎకరాలు, సిరిసిల్ల నియోజకవర్గంలో 64,670 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుంటే ఈపాటికే నీళ్లు కూడా అంది ఉండేవి!
ఆరోపణ: రైతు రుణమాఫీ సరిగా చేయకపోవడం, అన్నదాతలకు అండగా నిలవక పోవడం వల్ల బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
నిజం ఇదీ: పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు రైతులకు రూ.లక్ష చొప్పున రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచినట్టు దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని ప్రపంచ సంస్థలే ప్రశంసించిన విషయాన్ని రేవంత్ మరిచారు. రైతు బంధును ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. రైతు బీమాను తొలిసారిగా అమల్లోకి తెచ్చింది కేసీఆరే. 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణం అనతి కాలంలోనే పూర్తిచేసి రైతులకు అండగా నిలిచింది కేసీఆర్ మాత్రమే! క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా ఈ విషయం చెప్తారు.
ఆరోపణ : పదేండ్లు ప్రభుత్వం నడిపినోళ్లు.. 11 నెలలు గడవకముందే నువ్వు దిగిపో.. దిగిపో అంటున్నరు.. మీరు పదేండ్లు కూర్చున్నరు కదా.. ఏం వెలగబెట్టిండ్రు? పదేండ్లు మీరు చేయలేని పనులు మేం చేస్తుంటే మీకు కడుపునొప్పి వచ్చిందా?
ఇదీ నిజం : బీఆర్ఎస్ నాయకులు ఏనాడూ వచ్చి సీట్లో కూర్చుంటామని చెప్పలేదు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్నారు. అది కాంగ్రెస్‌కు అందులోనూ రేవంత్‌రెడ్డికి మింగుడు పడడం లేదన్నది వాస్తం. ఇక సోషల్ మీడియా గురించి రేవంత్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా కనిపిస్తున్నది. అధికారంలోకి రావడానికి రంగురంగుల యాడ్స్‌ను, ప్రకటనలను సోషల్‌మీడియా వేదికగా పోస్టు చేసింది.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసింది ఎవరని సభకు వచ్చినవారే చర్చించుకున్నారు.
ఆరోపణ : పది నెలల్లో మేం 50 వేల ఉద్యోగాలిచ్చినం. పదేండ్లలో నువ్వెన్నిచ్చినవో లెక్కలు చెప్పు? ఉద్యోగుల తలకాయలు లెక్కబెడుదాం. 50 వేలకు ఒక్క తలకాయ తక్కువ ఉన్నా ఎల్బీ స్టేడియంలో క్షమాపణ చెప్తా..
ఇదీ నిజం: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని లెక్కలతో సహా వివరించింది. కాంగ్రెస్ వచ్చాక నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పెట్టి ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని బీఆర్ఎస్ నిలదీస్తున్నది. ఆ విషయాలేవీ చెప్పకుండా బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్లతో వచ్చిన ఉద్యోగాలను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నది. మరో విషయం ఏమిటంటే అధికారంలోకి వచ్చిన తొలి ఏడా దిలోనే రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన విషయాన్ని రేవంత్‌రెడ్డి మరిచినట్టున్నది.
ఆరోపణ: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు ఎత్తకుండానే 66 లక్షల ఎకరాల్లో కోటీ 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈసారి మా ప్రభుత్వంలో పండించినం. లక్ష కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చి కేవలం 52 వేల ఎకరాలకే నీళ్లిచ్చారు.
ఇదీ నిజం : కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించాలని అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు. నిన్నామొన్నటి దాకా కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నవారు ఇప్పుడు 52 వేల ఎకరాలకు నీళ్లిచ్చారని అంటున్నారు. అంతేకాదు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ సీజన్లోనూ బాహుబలి మోటర్ల ద్వారా ఎల్లంపల్లి- మధ్యమానేరు- కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఈ మోటర్లు, కాలువలు, ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోతే ఎలా ఎత్తిపోసేవారు? ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అన్న విషయాన్ని మరిచి సీఎం మాట్లాడడం ఆయనకు ఇరిగేషన్ శాఖపై ఉన్న అవగాహనా రాహిత్యాన్ని బట్టబయలు చేస్తున్నది.
ఆరోపణ: ఈ పదేండ్లలో లక్షా 83 వేల కోట్ల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టిండ్రు. నేను సూటిగా అడుగుతున్నా ఏ ఒక్క ప్రాజెక్టునయినా తెలంగాణ ప్రజలకు అంకితం చేశావా?
ఇదీ నిజం: 2016 మే 2న కాళేశ్వరం పాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్.. ఇదే ప్రాజెక్టును 2019 జూన్ 21న జాతికి అంకితం చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి మరిచిపోయినట్టున్నారు.
ఆరోపణ: కొడంగల్ అభివృద్ధి కోసం.. అక్కడి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం నేను నాలుగు గ్రామాల్లో తొండలు గుడ్లుపెట్టని భూములు సేకరిస్తున్నా. ఎందుకు మీకంత కసి? కొడంగల్‌పై ఎందుకంత ద్వేషం?
ఇదీ నిజం: లగచర్లలో ప్రస్తుతం సేకరిస్తున్న భూములు నిజంగా తొండలు గుడ్లు పెట్టనివే అయితే ప్రజలే ముందుకొచ్చి అప్పగిస్తారు. మరి రైతులెందుకు తిరగబడుతున్నారు? తొండలు గుడ్లు పెట్టని భూములే అయితే అక్కడ భూమల విలువలు పెంచుమని చీఫ్ సెక్రటరీకి, కలెక్టర్లకు ఎందుకు ఆదేశాలిచ్చారు? ఎందుకు మూడింతల పరిహారం పెంచి ఇస్తామంటున్నారు? అంటే అవి విలువైన భూములే కదా?
ఆరోపణ: ప్రతి సంవత్సరం లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు బయటికొస్తున్నారు. వాళ్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా ఇవ్వాలి? వాళ్లను నిరుద్యోగులుగా రోడ్లమీద వదిలేద్దామా? ఉద్యోగం లేక తల్లిదండ్రులకు భారమై గంజాయి, డ్రగ్స్‌కు బానిసలను చేద్దామా?
ఇదీ నిజం: బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ముందంజలో ఉన్న విషయాన్ని సీఎం మరిచి మాట్లాడినట్టు కనిపిస్తున్నది. ప్రధానంగా ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేమని భావించిన కేటీఆర్, నూతన పారిశ్రామిక పాలసీని తెచ్చి ప్రపంచ దేశాల నుంచి ఎన్నో విలక్షణ కంపెనీలను హైదరాబాద్‌కు తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఏనాడూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే మార్గాలను బీఆర్ఎస్ వ్యతిరేకించలేదు. ఆ మార్గాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలనే కొరుకున్నది.
ఆరోపణ: ఒక్కసారి ఈప్రాంతం నుంచి ఎంపీగా పొన్నం ప్రభాకర్‌ను గెలిపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసిండు. కానీ, రెండు సార్లు గెలిపించిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి అయిండే తప్ప రూపాయి అయినా తెచ్చిండా? గతంలో గెలిచిన ఎంపీ వినోద్‌కుమార్ ఏమైనా అభివృద్ధి చేసిండా?
ఇదీ నిజం: వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు అనేక అభివృద్ధి పనులను కేంద్రాన్ని ఒప్పించి తెచ్చారు. వాటిని అమలయ్యేలా చూశారు. మచ్చుకు కొన్నింటిని చూస్తే.. కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లైన్‌ను సాధించడమే కాదు, ప్రధాని చేతులమీదుగా శంకుస్థాపన జరిగేలా చూశారు. కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్పించి వెయ్యి కోట్ల దాకా నిధులు తెచ్చారు. జాతీయ రహదారుల జంక్షన్‌గా కరీంనగర్‌ను తీర్చిదిద్దేందుకు జాతీయ రహదారుల కార్యాలయాన్ని కరీంనగర్లో ఏర్పాటు చేయించారు. ఇలాంటి అనేక కార్యక్రమాలను సీఎం మరిచిపోయి మాట్లాడారు.
ఆరోపణ: పదేండ్లు ప్రభుత్వాన్ని నడిపిన మీరు భూసేకరణ చేయలేదా? మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్‌కు భూసేకరణ చేయలేదా? ఫార్మాసిటీ పేరుతో ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో 14 వేల ఎకరాల భూములు సేకరించలేదా? ఇవాళ కొడంగల్‌లో ఒక వెయ్యి ఎకరాల భూ సేకరణ నేను చేస్తే మీకు కడుపు మంట ఎందుకు?
ఇదీ నిజం: బీఆర్ఎస్ సేకరించిన 14 వేల ఎకరాల భూమి రెడీగా ఉన్నదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు. నిజంగా ఫ్యాక్టరీలు పెట్టి.. కొడంగల్ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలంటే కొత్తగా భూసేకరణ ఎందుకు? రైతులపై దాష్టీకం చేసి లాక్కోవడం ఎందుకు? సేకరించి రెడీగా ఉన్న భూముల్లో ప్యాక్టరీలు తెచ్చి పెట్టొచ్చు కదా? అన్నది ప్రజల ప్రశ్న. సిద్ధంగా ఉన్న భూమిలో కాకుండా.. లగచర్లలోనే ఫార్మా కంపెనీలు పెట్టాలనే ఉద్దేశంలో ఆంతర్యమేమిటో ముఖ్యమంత్రే చెప్పాలి.
వేములవాడ, నవంబర్ 20 : వేములవాడ రాజన్న ఆలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజల సందర్భంగా అధికారులు చూపిన అత్యుత్సాహంతో భక్తులు బుధవారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచే భక్తులకు దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన ద్వారాన్ని కూడా మూసివేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతించకపోవడంతో ప్రధాన ఆలయం ముందు భక్తులు ‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా ప్రధాన ఆలయ రహదారి, జాతర గ్రౌండ్, పాత ఆంధ్ర బ్యాంక్ ఏరియాలో దుకాణాలను మూసివేయాలని వ్యాపారులను అధికారులు హెచ్చరించారు. షాపులన్నీ మూసివేయడంతో భక్తులకు తాగేందుకు కనీసం మంచినీళ్లు కూడా దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు విధించిన ఆంక్షలు ఇటు రాజన్న భక్తులను, అటు స్థానికులను కూడా ఇబ్బంది పెట్టాయి.